Sunday, September 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ దూకుడుపై ఆగ్రహం

ఇజ్రాయిల్‌ దూకుడుపై ఆగ్రహం

- Advertisement -

టెహరాన్‌ సహా పలు నగరాలు, పట్టణాల్లో భారీ ప్రదర్శనలు
టెహరాన్‌
: ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ముందస్తు దాడులకు పాల్పడిన ఇజ్రాయిల్‌ తీరును ఖండిస్తూ ఇరాన్‌ వ్యాప్తంగా శుక్రవారం ప్రదర్శనలు జరిగాయి. వందలు వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయిల్‌ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సంఘీభావాన్ని ప్రదర్శించారు. రాజధాని నగరం టెహరాన్‌, తబ్రిజ్‌, గిలాన్‌, ఇస్ఫాహన్‌లతో సహా దేశవ్యాప్తంగా పలు పెద్ద, చిన్న నగరాల్లో కనివినీ ఎరుగని రీతిలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతున్నా వాటిని లెక్కచేయకుండా ఈ ప్రదర్శనలు జరగడం విశేషం. టెహరాన్‌ యూనివర్శిటీలో శుక్రవారం ప్రార్ధనల అనంతరం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇరాన్‌, పాలస్తీనా, హిజ్బుల్లా పతాకాలు చేబూని నినాదాలు చేయడం కనిపించింది. ఇజ్రాయిల్‌ దాడులను సమర్ధవంతంగా తిప్పి కొడుతూ ఇరాన్‌ ప్రతీకారంతో జరుపుతున్న దాడులను సమర్ధిస్తున్నామని వారు నినాదాలు చేశారు. ఇజ్రాయిల్‌ దాడుల వేళ దేశ ప్రజలంతా సమైక్యంగా వుండాలంటూ ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ పిలుపిచ్చిన నేపథ్యంలో కొంతమంది ఖమేనీ ఫోటోలను కూడా పట్టుకోవడం ప్రదర్శనల్లో కనిపించింది. మరికొంతమంది ఈ దాడుల్లో చనిపోయిన కమాండర్ల ఫోటోలను ప్రదిర్శంచారు. టెహరాన్‌ ప్రదర్శనల్లో ఇరాన్‌ చీఫ్‌ జస్టిస్‌ గులామ్‌ హుస్సేన్‌, ఐఆర్‌జిసి మాజీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ మహ్మద్‌ అలీ జఫరీ, పలువురు మంత్రులు, పార్లమెంట్‌ డిప్యూటీస్పీకర్‌ ప్రభృతులు పాల్గొన్నారు.
బాగ్దాద్‌, బీరుట్‌ల్లో కూడా ప్రదర్శనలు
ఇరాక్‌లో కూడా ఇరాన్‌కు మద్దతుగా వేలాదిమంది ప్రదర్శనలు చేపట్టారు. బాగ్దాద్‌లోని సదర్‌ ప్రాంతంలో శుక్ర్రవారం ప్రార్ధనల అనంతరం ప్రజలు అమెరికా, ఇజ్రాయిల్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. విప్లవ నగరంగా పేరుబడిన సదర్‌ సిటీ బాగ్దాద్‌కు శివారు ప్రాంతంగా వుంది. దక్షిణ బీరుట్‌ నగరంలో కూడా ఇరాన్‌ అనుకూల ర్యాలీ జరిగింది.
వెనిజులాలో…
ప్రపంచ శాంతిని కోరుతూ, ఇరాన్‌, పాలస్తీనాలకు మద్దతుగా, ఇజ్రాయిల్‌ వైఖరిని ఖండిస్తూ వెనిజులన్లు గురువారం ప్రదర్శన నిర్వహించారు. వేలాదిమంది కారకస్‌ వీధుల్లోకి వచ్చి నినదించారు. విదేశీ దురాక్రమణ చర్యలను ఖండిస్తూ వెనిజులా నేతలు, తక్షణమే ఈ యుద్ధాలను ఆపేందుకు అంతర్జాతీయ సమాజం ఏక తాటిపైకి రావాలని కోరారు. పాలక యునైటెడ్‌ సోషలిస్టు పార్టీ ఆఫ్‌ వెనిజులా (పిఎస్‌యువి) సెక్రటరీ జనరల్‌ డిసొడాడో కాబెల్లొ ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించారు. ఆత్మరక్షణ కోసం, తమ భూభాగ రక్షణ కోసం పోరాడే హక్కు ఇరాన్‌కు వుందని అన్నారు. వెనిజులా నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జి రొడ్రిగజ్‌ మాట్లాడుతూ మన చిన్నారులకు అందమైన, ప్రశాంతమైన ప్రపంచాన్ని ఇవ్వాల్సిన అవసరం వుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -