Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించాలి

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించాలి

- Advertisement -

– ఆర్డర్లు జారీ చేయాలి
– ప్రధాన శాఖల్లో నిలిచిన వేతనాలు
– వీధిన పడుతున్న కుటుంబాలు
– రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు : జె.వెంకటేష్‌ ఇందిరాపార్కు వద్ద ధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వెంటనే కొనసాగింపు ఉత్తర్వులు (కంటిన్యూయేషన్‌ ఆర్డర్లు) జారీ చేయాలని కాంట్రాక్ట్‌-ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద గురువారం ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.పద్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.4 లక్షల మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చాలా తక్కువ వేతనాలతో 25 ఏండ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. పర్మినెంట్‌ చేస్తామని వాగ్దానం చేసిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారి ఆశల్ని వమ్ము చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా పరిస్థితిలో మార్పు లేదని తెలిపారు.


ఇంకా రాని ఉత్తర్వులు
ప్రతి ఏటా ఏప్రిల్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులు రావాల్సి ఉంటే.. ఈసారి ఇంకా ఇవ్వలేదని, అనేక శాఖల ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని వెంకటేష్‌ తెలిపారు. జీఎస్టీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పోలీస్‌, పశుసంవర్థక, మిషన్‌ భగీరథ, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ శాఖల్లో వేతనాలు నిలిచిపోయాయని తెలిపారు. ఉద్యోగ భద్రతే గల్లంతవుతోందన్నారు.


జీఎస్టీ శాఖలో ఏప్రిల్‌ 2025 నుంచి 100 మంది ఉద్యోగులను తొలగించగా, పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసులో 75 మందికి ఇప్పటికీ కొనసాగింపు ఉత్తర్వులు రాలేదని చెప్పారు. వారి కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రత, బకాయి వేతనాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ నెల 8 వరకు వివిధ ప్రభుత్వ శాఖల హెచ్‌డీలకు మెమోరాండాలు అందజేస్తామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. ఈనెల 9న దేశవ్యాప్త ఉద్యోగ, కార్మిక సమ్మెకు మద్దతుగా జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ”చలో హైదరాబాద్‌” నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జె.కుమారస్వామి, వ్యవసాయ సెక్యూరిటీ గార్డ్‌ యూనియన్‌ నాయకులు వై.సోమన్న, సాంబయ్య, రాజారెడ్డి, యాదగిరి, ఆర్‌.సురేష్‌, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రధాన నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -