26 మందికి 90 పర్సంటేజ్ కు పైగా స్కోర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జేఈఈ మెయిన్-2026 మొదటి విడత పరీక్షల్లో గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) విద్యార్థులు అత్యద్భుత ప్రతిభను కనబరిచారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్ డబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో సీఓఈలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు వందల సంఖ్యలో ఉత్తమ పర్సంటైల్ తెచ్చుకుని మరోసారి తమ సత్తా చాటారు.
రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సీఓఈ కళాశాల నుంచి వై.నవదీప్ 98.39 పర్సంటేజ్ తో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత సత్య స్వరూప్ 97.99, యశ్వంత్ 95.70, ఎం.మహేష్ 95.18, ఎస్.రాజు 94.83 పర్సంటేజ్ లు సాధించారు. గౌలిదొడ్డి బాలికల సీఒఈ నుంచి కె.శ్రీవర్ష 94.64 పర్సంటేజ్ తో బాలికల్లో అగ్రగామిగా నిలిచారు. అదే కళాశాల నుంచి వి.మంజుల 92.25 పర్సంటేజ్ లు సాధించి విశేష ప్రతిభను ప్రదర్శించారు.
వనపర్తి జిల్లా మదనాపురం సీఓఈ నుంచి పి.సూర్యనారాయణ అనే విద్యార్థి 94.03 పర్సంటైల్ సాధించి ప్రశంసలందుకున్నారు. సీఓఈ కేంద్రాల నుంచి మొత్తం 26 మంది విద్యార్థులు 90 పర్సంటేజ్ కు పైగా, 109 మంది విద్యార్థులు 80 పర్సంటేజ్ కు పైగా, 236 మంది విద్యార్థులు 70 పర్సంటేజ్ కు పైగా ఫలితాలు సాధించారు. గత సంవత్సరం కట్‌ఆఫ్‌ను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా 337 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 పరీక్షకు అర్హత సాధించినట్టు అంచనా.
మంత్రి అడ్లూరి అభినందనలు
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి సహకరించిన బోధనా సిబ్బందినీ, సంబంధిత ప్రధానోపాధ్యాయులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గురుకులాల్లో విద్యా ప్రమాణాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సహకారంతోనే : కృష్ణ ఆదిత్య
విద్యార్థులు సాధించిన విజయాల పట్ల వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సొసైటీ అమలు చేస్తున్న పటిష్టమైన విద్యా ప్రణాళిక, అత్యంత అనుభవం గల బోధనా సిబ్బంది, ఉపయోగకరమైన రెఫరెన్స్ పుస్తకాలు, అలాగే ప్రభుత్వ సహకారంతోనే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని సంస్థ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఐఏఎస్ తెలిపారు. రాబోయే జేఈఈ మెయిన్ రెండో విడత, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేలా మరింత శ్రద్ధతో ప్రణాళికాబద్ధంగా శిక్షణ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.



