పాట్నా : బీహార్ ఎన్నికల్లో వంద ఏండ్లకు పైగా వయస్సున్న వృద్ధుల సంఖ్య 14వేలకు పైగా ఉన్నది. ఎన్నికల సంఘం(ఈసీ) సమాచారం ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా 85 ఏండ్లు, అంతకు మించి వయస్సున్న ‘చాలా వృద్ధులు (వెరీ సీనియర్ సిటిజెన్స్)’ విభాగంలో వీరి సంఖ్య బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) తర్వాత గణనీయంగా తగ్గిపోయింది. ఈసీ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1 నాటికి 85 ఏండ్లు పైబడిన ఓటర్లు 16,07,527 మంది ఉన్నారు. అయితే వీరి సంఖ్య ఎస్‌ఐఆర్ తర్వాత 4,03,985కు పడిపోవటం గమనార్హం. జనవరి 1 నాటికి మహిళా ఓటర్ల సంఖ్య 3.72 కోట్లుగా ఉంటే.. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తర్వాత అది 3.49 కోట్లకు తగ్గింది.
ఇక పురుష ఓటర్ల సంఖ్య కూడా 4.07 కోట్ల నుంచి 3.92 కోట్లకు పడిపోయింది. థర్డ్ జెండర్ క్యాటగిరీకి చెందిన ఓటర్ల సంఖ్య కూడా 2,104 నుంచి 1725కి తగ్గింది. అయితే జిల్లాలవారీగా వయస్సుకు సంబంధించిన, మరణం కారణంగా తొలగించిన ఓటర్ల వివరాలను మాత్రం ఈసీ వెల్లడించలేదు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ముందు బీహార్‌లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రక్రియలో 65 లక్షల మంది పేర్లను తొలగించారు. ఆ తర్వాత ఆగస్టు 1న ముసాయిదా జాబితాను ప్రచురించగా.. అందులో 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అనంతరం 3.66 లక్షల మంది అనర్హులైన ఓటర్లను తొలగించారు. ఫారమ్ 6 దరఖాస్తుల ద్వారా 21.53 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారు. దీంతో ఓటర్ల తుది సంఖ్య 7.43కు చేరుకున్నది.
బీహార్‌లో 14వేల మందికిపైగా శతాధిక వృద్ధ ఓటర్లు
- Advertisement -
- Advertisement -