నటన ఆమె పాలిట శాపమైంది. ఆమె నటించడం ఒక నేరమైంది. ఆమెపై ఈ వ్యతిరేకత ఇంతటితో ఆగలేదు. ఆమె నటించిన సినిమా తెరపై కనిపిస్తే ఆ తెరను చించి వేశారు. ఆ తర్వాత ఆమెపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి గాయపరిచి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దారుణ దౌష్ట్యం ఇంతటితో ఆగలేదు. ఆమెను, ఆమె కుటుంబాన్ని వెంటాడి, వేటాడి దాడులు చేసి చివరాఖరికి వారు నివాసముంటున్న ఇంటికి కూడా నిప్పు పెట్టారు.
ఇంతకు ఆమె చేసిన నేరం ఏమిటంటే ఆమె ఒక దళిత కుటుంబంలో పుట్టి వెండితెరపై ఒక అగ్రవర్ణ నాయర్ మహిళ పాత్రను పోషించడం. ఈ దుర్మార్గాలకు భయపడి ఆమె వెండితెరకు దూరమైంది. ఆమెకు తొలి సినిమానే చివరి సినిమా అయింది. ఆమె పీకే రోజీ. మలయాళీలు తీసిన తొలిమూకీ హీరోయిన్. మీదు మిక్కిలి భారతీయ సినిమాలో తొలి దళిత నటి.
దక్షిణ భారత దేశంలో చివరి దశలో మూకీలు తీసినవారు మలయాళీలు. అప్పటివరకూ వారు మద్రాసు, బొంబాయిల్లో తీసిన మూకీలనే చూసేవారు. అయితే మలయాళీల తొలి మూకీ ‘విగత కుమారన్’ (తప్పిపోయిన బిడ్డ )1928లో విడుదలైంది. ఈ చిత్ర దర్శకుడు జె.సి, డానియల్. యీయన పేర కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ఇటీవలే మన తెలుగు నటి శారద అందుకున్నది.
‘విగత కుమారన్’ సినిమాకు ఎంత చరిత్ర ఉన్నదో ఈ చిత్ర నాయిక పి.కె.రోజీకీ అంతకుమించిన చరిత్ర ఉంది. ఈమె తొలి మలయాళ సినిమా కథానాయికగా చరిత్ర కెక్కింది. అసలు పేరు రోజమ్మాళ్. పూర్తి పేరు ఫౌల్ కుంజి రోజి. 1903 ఫిబ్రవరి 10న త్రివేండ్రమ్ దగ్గర నందన్ కోడిలో జన్మించిందామె. తండ్రి పాలోజి, తల్లి కుంజి. వారిది దళిత కులంలో పులియా శాఖ. రోజ్ కుటుంబం క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. బాల్యంలోనే తండ్రి మరణించడంతో వారి కుటుంబం పేదరికంలో మగ్గిపోవలసి వచ్చింది. కడలూరులో తన మామల ఇంట్లో పెరిగిందామె. అక్కడ బతుకుదెరువు కోసం కూలీ పనులు చేసేది.
పేదరికం వల్ల చిన్నతనం నుండి గడ్డి కోసుకుని వచ్చి, అమ్ముకునే పని చేసినా రోజీకి నటన అంటే ఇష్టం ఉండేది. అయితే ఆ కాలంలో స్త్రీలు నాటకాలలో వేషాలు వేస్తే సమాజం నుండి వ్యతిరేకత ఎదురయ్యేది. సంప్రదాయవాదులు ఆ స్త్రీలపై చెడు ప్రవర్తన గల స్త్రీలుగా ముద్రవేసేవారు. ఈ కారణాల వలన వారి కుటుంబమంతా క్రైస్తవాన్ని స్వీకరించింది. అప్పటి నుండి రోజమ్మాళ్ ‘పి.కె. రోజీ’గా మారింది. తిరువాంకూర్‌లోని థైకాడ్‌లో ఉన్న నాటి జానపద దళిత నాటక రంగం ‘కక్కరిస్సి’లో చేరి ఆమె నటనలో శిక్షణ పొందింది. వీరి నాటకాలలో పార్వతి, గంగా వంటి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నదామె. ఈ నాటకాల ద్వారానే రోజి తొలి మలయాళ మూకీ ‘విగత కుమారన్’ ద్వారా సినిమా రంగానికి పరిచయమయ్యే అవకాశాన్ని పొందింది.
ఐతే ‘విగత కుమారన్’ కోసం రోజి కన్నా ముందు బొంబాయి నటి ‘ఎం ఎస్. లానా’ను ఎంపిక చేశాడు డేనియల్. ఆమె పారితోషికం 5000/- రూపాయలు. కానీ ఆమె బొంబాయి నుండి తిరువనంతపురం రాగానే కారుంటే గాని బయటికి రానని భీష్మించుకుని కూర్చుంది. అప్పట్లో ఆ నగరంలో తిరువాంకూరు మహారాజా, మారేకర్ అనే వ్యాపారి మాత్రమే కార్లుండే ధనవంతులు. ఎలాగోలా మారేకర్‌ను కారు ఇచ్చేలా ఒప్పించారు. అయితే ఆమె కోర్కెల చిట్టా ఇంతటితో ఆగిపోలేదు. తనకు కేటాయించిన ఇల్లు బాగోలేదని, ఏదైనా పెద్ద బంగళా కావాలన్నది. డేనియల్ ఆమె ‘గొంతెమ్మ కోర్కెలు’ తీర్చలేక సినిమా సెట్స్ మీదికి రాకముందే ఎం.ఎస్. లానాను బొంబాయికి తిప్పి పంపాడు. ఆమె అలా వెళ్ళిపోవడమే భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనానికి బీజం పడింది.
లానా వెళ్ళిపోయాక డేనియల్ కొత్త హీరోయిన్ కోసం వెదుకుతుండగా జాన్సన్ అనే రోజీ సహ నటుని సూచన మేరకు ఆమెను కలుసుకుని హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. జాన్సన్ కూడా ఇందులో విలన్ వేషం వేశాడు. రోజీని రోజువారి పారితోషికం చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమె ఉదయం 9 గంటలకు షూటింగ్‌కి వెళ్ళి చీకటిపడే దాక పనిచేసేది. లొకేషన్ను విడిచి వచ్చే ముందు అక్కడి వంటగదిని శుభ్రం చేయడం కూడా ఆమె డ్యూటీలో భాగం. ఇందుకుగాను ఆమెకు రోజూ అయిదు రూపాయల ముట్టేది.
రోజీకి నాటక రంగంలో ప్రవేశం ఉండటం వల్ల డేనియల్ సూచనలను గ్రహించి అవలీలగా నటించేది. ఐతే రోజీ ‘విగత కుమారన్’లో నటించింది ఒక ‘నాయర్’ మహిళ పాత్ర. ఇది ఆ కాలంలో పెద్ద సంచలనం. ఛాందస ప్యూడల్ నాయర్ సమాజం ఒక దళిత స్త్రీ ‘నాయర్’ మహిళ వేషం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. చాలా మంది పెద్దలు, పౌర సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తమైంది. ఒకవేళ రోజీ గనుక వస్తే ఈ సినిమా ప్రారంభోత్సవానికి రాలేమని, సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. దాంతో డేనియల్ సైతం భయపడి రోజీని సినిమా ఫస్ట్ షోకి ఆహ్వానించలేకయాడు.
త్రివేండ్రంలోని కాపిటల్ థియేటర్లో ‘విగత కుమారన్’ 1928 నవంబర్ 7న విడుదలైంది. ఐతే 1928లో కాకుండా 1930 అక్టోబర్ 23న విడుదలైనట్లు పత్రికా ప్రకటన ఒకటి ఇంటర్నెట్లో కనిపించింది. అయితే 1928లోనే ఈ చిత్రం విడుదలైందని, ఆ పోస్టర్ కల్పితమని ప్రముఖ మలయాళ సినీ జర్నలిస్ట్ సాజు చేలాంగద్ ఈ రచయితకు తేల్చి చెప్పాడు.
‘విగత కుమారన్’ త్రివేంద్రంలోని కాపిటల్ థియేటర్లో ప్రదర్శితమైనపుడు ఈ చిత్రంలో దళిత మహిళ రోజి నటించినది నాయర్ మహిళ పాత్ర. సినిమాలోని ప్రధాన పాత్ర ఒకటి రోజి తలలోని పువ్వును ముద్దు పెట్టుకుంటుంది. ఈ కారణంతో సినిమా నడుస్తుండగా తెరపైకి రాళ్లు విసిరారు. ఫలితంగా సినిమాను నడవనీయలేదు. దాంతో డేనియల్‌కి పెట్టుబడి కూడా తిరిగి రాలేదు.
ఒక నాయర్ మహిళ వేషం దళితురాలు వేయడం హిందూ అగ్రవర్ణాల ఆగ్రహానికి కారణమైంది. సినిమా ప్రారంభం చేయడానికి నిరాకరించిన నాటి ప్రఖ్యాత న్యాయవాది మధూర్ గోవిందన్ పిళ్లైకి బదులుగా ఏర్పాటు చేసిన రెండవ ప్రదర్శనకు రోజీ రావడటానికి వీలు కల్పించారు. కానీ థియేటర్లో ఛాందస వాదులు రెచ్చిపోయి సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. థియేటర్లోని స్క్రీన్‌ను చించివేశారు. ఆ తర్వాత రోజీపై దాడికి పూనుకున్నారు. దాంతో ఆమె తన నివాసాన్ని తల్లి వద్దకు లా మార్కెట్‌కి మార్చింది. నాటి ట్రావెన్కూర్ పాలకులు ఆమె పక్షాన మద్దతుగా నిలబడ్డారు. ఆమెకు రక్షణగా పాలకులు పోలీసులను నియమించారు. అయినా వారి పూరి గుడిసెను దుండగులు కాల్చీవేశారు. వారి తల్లి, సోదరీ సోదరులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను తట్టుకోలేని రోజీ తన వారినందరినీ తీసుకుని ఓ ట్రక్కులో నాగర్ కోయిల్‌కు తరలిపోయింది.
ఇక్కడితో రోజీ ఏమైందో నాలుగు దశాబ్దాల పాటు ఎవరికీ తెలియలేదు. నాగర్ కోయిల్ కేశవ పిళ్లై అనే లారీ డ్రైవర్‌ని రెండో పెళ్లి చేసుకున్న రోజీ అక్కడ ‘రాజమ్మ, రాజమ్మాళ్‌గా కొత్త జీవితం ప్రారంభించింది. కొన్నేళ్ళ క్రితం కొందరు సినిమా పరిశోధకులు రోజీ తరువాతి జీవితాన్ని గురించిన విషయాలను పరిశోధించి అరడజను వ్యాసాలు రాశారు. ఆమెకు పద్మ, నాగప్పన్ ఇరువురు సంతానం. వారు మధురై, నాగర్ కోయిల్లో నివాసముంటున్నారు. చివరికి రోజీ తన 85 ఏట 1988లో నాగర్ కోయిల్ టౌన్లోని ఊట్టుపుర తెరువులో అనామకంగా మరణించింది. విచిత్రమేమిటంటే ఈ చిత్ర దర్శకుడైన జే.సి.డానియల్‌ని కూడా తర్వాత సినిమా రంగంలో కొనసాగకుండా పరిశ్రమకు దూరం చేశారు నాటి నాయర్‌లు.
2013లో ‘సెల్యులాయిడ్’ పేరున కమల్ తీసిన సినిమాతో మళ్ళీ పి.కె. రోజీ వార్తల్లోకి వచ్చింది. ఇది తొలి ‘విగత ‘కుమారన్’ దర్శకుడి జె.సి. డేనియల్ జీవితం ఆధారంగా తీసిన సినిమా. విను అబ్రహాం రాసిన ‘నష్టనాయిక’ నవల ఆధారంగా తీసారు. చాందినీ గీత అనే నూతన నటి రోజీ పాత్రను పోషించింది. ఇదే గాక ‘ది లాస్ట్ చైల్డ్’, ‘ఇదు రోజియుడె కథ’ అనే రెండు సినిమాలు కూడా రోజీ జీవితం ఆధారంగా రూపొందినవి. మరో వైపు కేరళ ప్రభుత్వ పురస్కారాలలో ఉత్తమ తొలి చిత్ర కథానాయికకు ఈమె పేర అవార్డును ప్రవేశపెట్టింది. గత 2019లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన బిర్యానీ చిత్ర హీరోయిన్ కనికుశతి నేటికీ మళయాళ చిత్ర రంగంలో కొనసాగుతున్న కుల వివక్షతను ఎత్తి చూపుతూ తన ఉత్తమ నటి అవార్డును పీ.కె. రోజీకి అంకితమివ్వడం కేరళ చిత్ర రంగంలో ఒక ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. కాగా, రోజీ జీవితం గురించి కేరళలో శ్రీ శంకర యూనివర్శిటీలో ఒక సెమినారే జరిగింది. వినూ ఆబ్రహాం పి.కె. రోజీ జీవిత కథ ఆధారంగా ‘ది లాస్ట్ హీరోయిన్’ అనే నవలను రాశారు. ఇంకా కేరళలో పి.కె. రోజీ ఎంతగా వార్తల్లో వెలుగుతున్నదంటే ఆమె పేరున పీ.కె. ఫిల్స్ సొసైటీ, పి.కె.రోజ్ ఫౌండేషన్, పి.కె.రోజీ స్మారక సమితులు వెలిసి దళిత ఉద్యమాలకు వేదికలయ్యాయి. 2013లో జామియా మిల్లియా ఇస్లామియాలో పి.కె. రోజీ తొలి లెక్చర్ ఏర్పాటయింది. జెన్నీ రేవా అనే దళిత యాక్టివిస్ట్ దీనికి అధ్యక్షత వహించారు. వీటికన్నా ముందు తొలినాళ్ళలో కున్ను కుళ్ళి మణి అనే జర్నలిస్టు. దళిత యాక్టివిస్టు యేండ్ల కొద్ది శ్రమించి అన్వేషించి రోజీ కుటుంబ సభ్యులను కలుసుకొని ఆమె గురించి చిత్రభూమి, చంద్రిక, తేజస్ తదితర మాస పత్రికలలో వ్యాసాలు రాసి వెలుగులోకి తీసుకువచ్చారు. మరోవైపు దిహిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ హెరాల్డ్, కొచ్చిపోస్ట్, ద వీక్ వంటి ప్రసిద్ధ పత్రికలు పీ.కె. రోజీ జీవితంపై ప్రముఖంగా వ్యాసాలు ప్రచురించినవి. 2023లో పీకే రోజీ 120వ జయంతి సందర్భంగా గూగుల్ ఆమె ఫొటోతో డూడుల్‌ని అంకితం చేసింది.
దళిత కుటుంబంలో పుట్టి నాటక, సినిమా రంగాల్లో రాణించాలని కలగన్న రోజీ తన మొదటి అడుగులోనే సమాజం నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నది. తన కళా జీవన ప్రయాణంలో ఆమె అనుభావాలు, బాధామయ సందర్భాలు బహుషా భారతీయ సినిమా రంగంలోనే కాదు ప్రపంచ సినీ రంగంలో మరే నటికీ ఎదురై వుండవు. కేరళలో నేడు ఆమె మళయాళీ చలనచిత్ర మాతమూర్తిగా కీర్తినందుకుంటున్నది. రోజీ మలయాళ సినిమా చరిత్రలో ఒక రాలిన ఒక అశ్రు బిందువు. పీకే రోజీ తొలి చిత్రంతోనే ఆమెను వివిధ రకాలుగా వెంటాడి వేధించినప్పటికీ వెండి తెరపై నటించిన తొలి దళిత మహిళగా ఆమె పొందిన స్థానాన్ని మారెవరు అందుకోలేరు. పీకే రోజీ చెరిగిపోని ఒక చరిత్ర.
వ్యాసకర్త సినీ చరిత్ర పరిశోధకుడు
– హెచ్ రమేష్ బాబు, 7780736386



