– బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాడుతాం
– 6న ఢిల్లీలో ధర్నా
– మీ నమ్మకాన్ని కాపాడుకుంటాం.. అన్నీ హామీలు అమలు చేస్తాం
– కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
– వికారాబాద్ జిల్లా పరిగిలో జనహిత పాదయాత్ర ప్రారంభం
– పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, సురేఖ
నవతెలంగాణ -పరిగి, దోమ
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో ధర్నా చేపడుతామని, ఈ పోరాటంలో ప్రజలందరూ తమ వెంట ఉండాలని, ఎప్పుడైతే పోరాటం ప్రజా ఆందోళనగా మారుతుందో అప్పుడు విజయం సాధిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకే తాము పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. ‘జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన్’ కార్యక్రమంలో ‘జనహిత’ పాదయాత్రను వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవపూర్‌లో గురువారం ఆమె ప్రారంభించారు. ఈ పాదయాత్రలో టీపీసీసీ మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. రాఘవపూర్ నుంచి పరిగి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ప్రేమతో, కష్టపడి పాదయాత్రకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్ర అనే ఆచారం చాలా పురాతనమైనదని, దేశంలోని మసీదులు, దేవాలయాలు వంటి పవిత్ర స్థలాలకు వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్తామని అన్నారు. 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ తమకు కొత్త దారి చూపించారని తెలిపారు. ఆయన చూపించిన దారిలో తామూ నడుచుకుంటూ ప్రజల మధ్యకు వచ్చామని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడిన తెలంగాణను మోడల్‌గా చెప్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో పేదలను అభివృద్ధి చేసే విధంగా ముందుకు కొనసాగుతామని అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి గ్రామస్థాయిలో కూడా పార్టీ అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నరానరాల జీర్ణించుకుపోయిన అంశమని అన్నారు. పాదయాత్ర ద్వారానే దేశాన్ని చూడగలిగామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో యాత్రలు చేశారని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలు ఇచ్చినందుకు ప్రజలు పార్టీని నమ్మారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల కాలంలో ఏడున్నర లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. బీజేపీ మెడలు వంచి బీసీ రిజర్వేషన్స్ తెచ్చుకునే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. నిజాం ప్రభువు వదిలేసిన లక్షల కోట్ల భూములను కేసీఆర్ ప్రయివేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని విమర్శించారు. ఈ యాత్ర నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
ప్రజలకు చేరువయ్యేందుకే పాదయాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES