నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో నాలుగైదు రోజులుగా కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది.చేతికి వచ్చిన పత్తి చేనులోనే తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు వరిపైరు నేలవాలింది. పెట్టిన పెట్టుబడులు వచ్చేలా లేవని తమకు ఆత్మహత్యలే చరణ్యమని ఆర్థికంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు నష్టపోయామని ప్రభుత్వం ఎకరాకు రూ.40 వేలు చెల్లచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండలంలో 15,500 ఎకరాల్లో వరి,3,800 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షానికి వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
కళ్ళముందే పంటలు నాశనం…
మోంథా తుఫాన్ కారణంగా చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు ఎంతో నష్టం చేకూరింది. చేతికొ చ్చిన పంటలు కళ్ల ముందే నాశనం అవుతుంటే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో కురిసిన వర్షాలతో పత్తి కాయ రాలిపోయిందని, ప్రస్తుతం పొట్టకు వచ్చిన వరిపంట నేలకొరిగింది. దీంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదు కోవాలని కోరుతున్నారు.



