-మందకోడిగా సాగుతున్న మొక్కజొన్న కొనుగోళ్లు
నవతెలంగాణ – రాయికల్
మొంథా తుపాన్ ప్రభావం వల్ల మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంట నీటమునిగింది. పట్టణంలోని మార్కెట్ కమిటీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు మందకోడిగా సాగడంతో మొక్కజొన్న ధాన్యం కేంద్రంలో తడిసి ముద్దయ్యింది. ఖరీఫ్ సీజన్లో మండల వ్యాప్తంగా 20 వేల 5 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. కేవలం 30 శాతం రైతులు మాత్రమే పొలాల నుండి ధాన్యం సేకరించారు. 2,260 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. 889 ఎకరాల్లో పత్తి పంట ను సాగుచేశారు.
మొంథా తుపాన్ తో పొలాల్లో నిల్వ నీరు తగ్గకపోతే పంట పూర్తిగా పాడైపోతుందని రైతులు అంటున్నారు. చేసిన కష్టం కళ్లముందే కూలిపోయిందని, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కు చిక్కుకున్నట్లు అయిందని, విత్తనాలు, ఎరువులు, కూలీలకు చేసిన ఖర్చు ఇప్పుడు వృథా అవుతుందనే ఆందోళనలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతికొచ్చిన పంట నీటి పాలైంది -అటకాపురం శ్రీనివాస్ రైతు, అల్లీపూర్
చేతికొచ్చిన పంట నీటిపాలైంది. కోసిన మెదలు ఆరకముందే వర్షం రావడంతో.. నీటిలో నుండి ధాన్యం మెదలు ఒడ్డుకు తెస్తున్నాం. మూడు ఎకరాల్లో పండించిన వరి పంట మొత్తం దిగుబడి ప్రమాదంలో పడింది. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పంట నష్టపరిహారాన్ని రైతులకు అందజేయాలని వేడుకుంటున్నాను.
పోలాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి -మండల వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్
తుఫాన్ ప్రభావంతో వర్షాల వల్ల వరి ధాన్యం ఉబ్బిపోయి రంగు మారే ప్రమాదం ఉంటుంది.తద్వారా ధాన్యానికి మద్దతు ధర తగ్గుతుంది. పొలం మడులు పూర్తిగా ఆరిన తర్వాతే కోతలు ప్రారంభించాలి.కోసిన వారు ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్ఫాలిన్ కవర్లతో కప్పి ఉంచి, ఎండ కొట్టినప్పుడు ఆరబెట్టాలి.వర్షం వల్ల నీరు నిల్వ లేకుండా ఒడ్లకు గండిపెట్టి నీటిని పొలంమడి నుండి బయటకు మళ్ళించాలి.
-ప్రభుత్వం స్పందించాలి
అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణమే పర్యటించి,పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించాలని. తమ కష్టం గుర్తించి ప్రభుత్వం ఆదుకుంటేనే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని రైతులు అభ్యర్థిస్తున్నారు. అలాగే పట్టణంలోని మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేసే మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.




