పెరిగిన తెలంగాణ సాగు విస్తీర్ణం
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు నాలుగో స్థానం : ఆర్థిక సర్వే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జాతీయ సగటు కంటే వరి దిగుబడి తక్కువగా ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నివేదిక ఆధారంగా ఖరీఫ్ పంటలలో హెక్టారుకు దిగుబడిని వివిధ రాష్ట్రాలలో గణాంకాలను ఆర్థిక సర్వే విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు వంటి అనేక ప్రధాన వరి పండించే రాష్ట్రాలలో హెక్టారుకు దిగుబడి జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపింది.
దీనికి అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, పంట కీలక దశలలో వర్షాభావ పరిస్థితులే దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది. కార్మిక రంగంలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు విస్తృత శ్రేణి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలలో పనిచేసే మహిళలపై ఆంక్షలను తొలగించాయి. అనేక రాష్ట్రాలు వినూత్న, భాగస్వామ్య ఆధారిత నమూనాలతో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణ డబ్ల్యూఈ-హబ్ మహిళలను స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలతో అనుసంధానిస్తుంది.
పెరిగిన సాగు విస్తీర్ణం
తెలంగాణలో సాగు యోగ్య భూ విస్తీర్ణం 2014-23 మధ్య 1.31 కోట్ల ఎకరాలు ఉందనీ, అది ప్రస్తుతం 2.21 కోట్ల ఎకరాలకు పెరిగినట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను గురువారం ప్రవేశపెట్టింది. తెలంగాణలోని అభివృద్ధి అంశాలను అందులో ప్రస్తావించింది. తెలంగాణకు చెందిన పలు విషయాల గురించి ప్రకటించింది. తెలంగాణలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగు విస్తీర్ణం మెరుగుపడిందని పేర్కొంది. అత్యధిక పట్టణ జనాభాలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మహానగరాలు ఉన్నట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉన్నది.
తయారీ రంగంలో తెలంగాణ ఐదు శాతం వాటా నమోదు చేసిందని పేర్కొంది. ఏఐ స్టార్టప్‌ల్లో తెలంగాణ వాటా ఏడు శాతం కాగా 30 శాతంతో కర్నాటక అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసుల్లో కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల వాటా 40 శాతంగా నమోదైంది. భూభారతి పోర్టల్ ద్వారా రెవెన్యూ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల విభాగాలను ఏకీకృతం చేసిందని తెలిపింది. 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ 201.4 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మున్సిపల్ బాండ్ల జారీలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన వరి దిగుబడి
- Advertisement -
- Advertisement -



