Saturday, January 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఖాకీల గర్జనతో దిగొచ్చిన 'పాడి'

ఖాకీల గర్జనతో దిగొచ్చిన ‘పాడి’

- Advertisement -

‘నోరు జారానంటూ’ సీపీకి కౌశిక్‌రెడ్డి క్షమాపణలు
వీణవంక జాతర సాక్షిగా చెలరేగిన ఆధిపత్య పోరు
కరీంనగర్‌ సీపీపై అనుచిత వ్యాఖ్యలు
ఆగ్రహించిన ఐపీఎస్‌ అధికారుల సంఘం
చివరకు సోషల్‌ మీడియా వేదికగా హుజురాబాద్‌ ఎమ్మెల్యే వివరణ

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచే హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఈసారి ఏకంగా పోలీస్‌ బాసులనే టార్గెట్‌ చేసి చిక్కుల్లో పడ్డారు. వీణవంక జాతర నిర్వహణ విషయంలో స్థానిక ఆధిపత్య పోరులో భాగంగా మొదలైన గొడవ కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలంపై వ్యక్తిగత, మతపరమైన దూషణల వరకు వెళ్లింది. దీంతో ఆ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలపాలు కాగా.. మరోవైపు ఐపీఎస్‌ అధికారుల సంఘం గట్టిగా స్పందించడం, కేసులు నమోదు కావడంతో ఎట్టకేలకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘అది ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు’ అంటూ కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.

సీపీపై ఎమ్మెల్యే దూషణ
జాతరలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కౌశిక్‌రెడ్డి రాకను అడ్డుకోవడంతో వివాదం ముదిరింది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే, హుజూరాబాద్‌లో రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలంను ఉద్దేశించి దూషించడమే కాకుండా, మతపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ దుర్భాషలాడినట్టు మీడియాలో వచ్చింది. విధుల్లో ఉన్న ఏసీపీ, సీఐలపై కూడా ఆయన దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని సైదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎమ్మెల్యేను విడుదల చేసినప్పటికీ, ఆయనపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. కౌశిక్‌రెడ్డిపై భారత న్యాయ సంహిత కింద కఠినమైన సెక్షన్లను నమోదు చేశారు. 295ఏ, 196 (మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం), 353 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు అడ్డుతగలడం)ఇతర సెక్షన్లు 341, 140 3ఏ, 506, 126 (2), 132, 299 వంటి సెక్షన్ల కింద హుజూరాబాద్‌ పోలీసులు కేసులు ఫైల్‌ చేశారు.

ఐపీఎస్‌ అధికారుల సంఘం ఆగ్రహం
కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలంపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల సంఘాలు అత్యంత తీవ్రంగా పరిగణించాయి. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి, విధుల్లో ఉన్న అధికారిపై మతం పేరుతో దూషణలు చేయడం గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కౌశిక్‌రెడ్డి తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాయి. ఈ మేరకు తెలంగాణ ఐఏఎస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.రామకృష్ణారావు, జయేష్‌రంజన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

ప్రభుత్వ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు కౌశిక్‌రెడ్డి ఒక వీడియో సందేశం ద్వారా తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు ప్రకటించారు. ‘పోలీసులంటే నాకు గౌరవం ఉంది. నాపై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం ఇక్కడి పోలీసులు నాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. నా సొంత ఊర్లో జాతరకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కలిగిన తీవ్ర ఒత్తిడిలోనే ఆ మాటలు అన్నాను తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి’ అంటూ కోరారు. ప్రస్తుతానికి క్షమాపణతో ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కౌశిక్‌రెడ్డి భావిస్తున్నప్పటికీ, ఆయనపై నమోదైన కేసులు, ఐపీఎస్‌ సంఘం ఆగ్రహం అంత సులభంగా సమసిపోయేలా లేవు.

వివాదానికి బీజం పడిందిలా
వీణవంక మండల కేంద్రంలో జరిగే సమ్మక్క-సారలక్క జాతర నిర్వహణపై ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డికి, ఆయన ప్రత్యర్థి పాడి ఉదయానంద రెడ్డి కుటుంబానికి మధ్య కొంతకాలంగా ‘వార్‌’ నడుస్తోంది. గతంలో ఈ జాతరను ప్రభుత్వమే నిర్వహించాలని కౌశిక్‌రెడ్డి కోర్టుకెళ్లారు. అయితే, ఆ స్థలం తమదని ఉదయానందరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారి పక్షాన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కౌశిక్‌రెడ్డిని జాతరకు రాకుండా అడ్డుకున్నారు. ఇదే వివాదానికి కారణమైందనేది స్థానికులు చెప్పిన అభిప్రాయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -