కర్నాటక తొలి ఇన్నింగ్స్ 689/6
లక్నో : ఉత్తరాఖాండ్‌తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్నాటక బ్యాటర్లు విశ్వరూపం చూపిస్తున్నారు. కెఎల్ రాహుల్ (141, 211 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), రవిచంద్రన్ స్మరణ్ (121 నాటౌట్, 191 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీలతో మెరువగా…దేవదత్ పడిక్కల్ (232, 330 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లు) ద్వి శతకంతో రెచ్చిపోయాడు. కృతిక్ కృష్ణ (60, 103 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), విద్యాధర్ (35 నాటౌట్) మెరవటంతో కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 180 ఓవర్లలో 6 వికెట్లకు 689 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి రవిచంద్రన్ స్మరణ్, విద్యాధర్‌లు అజేయంగా క్రీజులో నిలిచారు.
మెరిసిన మహ్మద్ షమి
జమ్మూ కశ్మీర్‌తో రంజీ సెమీస్‌లో పేసర్ మహ్మద్ షమి (3/60), ముకేశ్ కుమార్ (2/40) రాణించటంతో బెంగాల్ పైచేయి సాధించింది!. జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 198/5తో ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు మరో 130 పరుగుల వెనుకంజలో నిలిచింది. అబ్దుల్ సమద్ (82, 85 బంతుల్లో 12 ఫోర్లు), పరాస్ (58, 112 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. అంతకుముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 97.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. సుదిప్ కుమార్ (146), అభిమన్యు ఈశ్వరన్ (49), షాబాజ్ అహ్మద్ (42) రాణించారు.



