Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకాశ్మీర్‌లో పహల్గాం దాడి సూత్రధారి హతం

కాశ్మీర్‌లో పహల్గాం దాడి సూత్రధారి హతం

- Advertisement -

మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా
శ్రీనగర్‌:
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతబలగాలు మట్టుబెట్టాయి. శ్రీనగర్‌లోని పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులను బలగాలు హతమార్చినట్టు చినార్‌ కోర్‌ వెల్లడించింది. ఇందులో ఒకరు గతేడాది సోనామార్గ్‌ సొరంగం వద్ద ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదిగా గుర్తించారు. మరొకరు పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్‌ సాహా అలియాస్‌ హషీం మూసాగా అధికారులు వెల్లడించారు. హర్వాన్‌ ప్రాంతంలో పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ఉపయోగించిన పరికరాలు వంటి అనుమానాస్పద కమ్యునికేషన్లను బలగాలు గుర్తించాయి. వెంటనే అక్కడి చేరుకున్న బలగాలు ఆపరేషన్‌ మహదేవ్‌ పేరుతో సెర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్‌, 4 పారా కమాండోల బృందాలు ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించాయి. భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ ముగ్గురిని బలగాలు హతమార్చాయి.

మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరు గతేడాది అక్టోబర్‌లో సోనామార్గ్‌ సొరంగం వద్ద జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న జిబ్రాన్‌గా గుర్తించారు. నాటి దాడిలో వైద్యుడు సహా ఏడుగురు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో ఒక ఎం 4 కార్బైన్‌ రైఫిల్‌, రెండు ఏకే రైఫిల్స్‌తో పాటు పలు ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఆపరేషన్‌ మహదేవ్‌ పేరుతో జమ్మూకాశ్మీర్‌ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టింది. హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. చివరకు సోమవారం ఉదయం దాచిగమ్‌ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా, భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపగా ముగ్గురు హతమయ్యారు. మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తోయిబాకు చెందిన వారని సమాచారం. అంతకుముందు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ చేపట్టామని, మరణించిన ఉగ్రవాదులు ఆ దాడికి పాల్పడిన వారిగానే తెలుస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై సైన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad