ముగ్గురు క్రికెటర్ల మృతి
దాడి పిరికిపంద చర్య : ఏసీబీ
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లారటం లేవు. సరిహద్దు సమీపంలోని పక్టికా రాష్ట్రంలో పాకిస్తాన్ దళాలు జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు ఉర్గన్ నుంచి తూర్పు పక్టికా రాష్ట్రంలోని షరానాకు వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది. పాక్ దాడిలో మరణించిన క్రికెటర్లను కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌గా గుర్తించారు. ఈ దాడిలో మరో ఐదుగురు కూడా చనిపోయారు. ఇది పిరికిపంద చర్య అని ఏసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దాడి నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంక దేశాలతో జరగాల్సిన మూడు దేశాల క్రికెట్ సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగింది. పాక్ దాడిని అఫ్ఘాన్ టీ-20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్, అంతర్జాతీయ క్రీడాకారులు మహమ్మద్ నబీ, ఫజల్‌హక్ ఫరూఖీ తీవ్రంగా ఖండించారు.
ఇదిలావుండగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రతినిధులు శనివారం దోహాలో శాంతి చర్చలు ప్రారంభించారు. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భారత్‌తో కలిసి పాకిస్తాన్‌పై కుట్ర పన్నుతోందని నిందించారు. పాకిస్తాన్‌లో నివసిస్తున్న ఆఫ్ఘన్లు అందరూ తమ స్వదేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కాబూల్‌తో దౌత్య సంబంధాలు తెగిపోయాయని ఆయన ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, తమ దేశంలో వైమానిక దాడులు జరిపిందని, ఈ దాడుల్లో కనీసం పది మంది చనిపోయారని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు తెలిపారు.
పాక్‌పై ట్రంప్ విమర్శలు
కాల్పుల విరమణ అమలులో ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ ఘర్షణను నివారించడం తనకు ఎంతో తేలికైన పని అని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో శుక్రవారం విందు సమావేశం సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.