న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దును దాటి పొరబాటున పాకిస్తాన్‌లో ప్రవేశించిన బీఎస్‌ఎఫ్ జవాను పూర్నమ్ కుమార్ షాను బుధవారం ఉదయం 10.30 గంటలకు భారత్‌కు అప్పగించారు. గత నెల 23వ తేదీన షా పాకిస్తాన్‌లో ప్రవేశించగా ఆ దేశ రేంజన్లు ఆయనను నిర్బంధించారు. అప్పటి నుండి ఆయన వారి కస్టడీలోనే ఉన్నారు. సుమారు మూడు వారాల తర్వాత అమృతసర్‌లోని అట్టారీ జాయింట్ చెక్‌పోస్టు మీదుగా ఆయన దేశంలో ప్రవేశించారు. ‘అమలులో ఉన్న ప్రొటోకాల్స్ ప్రకారం అప్పగింత కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది’ అని బీఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ రేంజర్లతో తరచూ జరిపిన ఫ్లాగ్ మీటింగ్స్, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా బీఎస్‌ఎఫ్ చేసిన ప్రయత్నాల ఫలితంగా ఇది సాధ్యపడిందని వివరించింది. షా 21 రోజుల పాటు పాకిస్తాన్ కస్టదీలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన షా గత నెల 23న భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంట గస్తీ తిరుగుతూ పొరుగు దేశంలో ప్రవేశించారు. దానికి ముందు రోజే పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టారులో ఈ ఘటన జరిగింది. అక్కడ బీఎస్‌ఎఫ్‌కు చెందిన 73వ బెటాలియన్ గస్తీ తిరుగుతోంది. సరిహద్దు దాటగానే పాక్ రేంజన్లు షాను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. ఆయన ఆచూకీ తెలియకపోవడంతో బీఎస్‌ఎఫ్ వెంటనే స్పందించి పాకిస్తాన్ రేంజర్లను సంప్రదించింది. ఆయన పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాడని ధృవీకరించుకుంది. కాగా తన కుమారుడిని అప్పగించారని తెలియగానే షా తండ్రి భోలేనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నేను దీనిని నమ్మలేకపోతున్నాను’ అని ఆయన ఉద్వేగంతో అన్నారు.