భారత్ స్పందన
జడ్డా : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. ఆ ఒప్పందం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. పాక్ ప్రధాని షరీఫ్ బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించారు. రియాద్‌లో యువరాజుతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, చారిత్రక సంబంధాలను, అలాగే ఉమ్మడి ప్రయోజనాలకు దోహదం చేసే అంశాలను సమీక్షించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక ఒప్పందం చేసుకున్నారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే అది ఇద్దరిపైనా జరిగిన దాడిగా భావిస్తామని, అప్పుడు ఇరువురు ప్రత్యర్థితో పోరాడాలన్నది ఆ ఒప్పందం సారాంశం. ”పాక్-సౌదీ మధ్య వ్యూహాత్మక ఒప్పందం జరిగినట్టుగా ఉన్న నివేదికలు మా దష్టికి వచ్చాయి. దానిని మేం పరిశీలిస్తున్నాం. జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ ఒప్పందం పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని విదేశాంగ శాఖ స్పందించింది. కొన్ని నెలల క్రితం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్ర దాడి బదులుగా మన బలగాలు పాక్‌లోని ఉగ్రమూకలను మట్టుపెట్టాయి. దాని తర్వాత రెండు దేశాల మధ్య కొన్ని రోజుల పాటు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాక్-సౌదీ రక్షణ ఒప్పందం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES