నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్ సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన జవాన్ పూర్ణం కుమార్ షా పాక్ సైనికుల చేతిలో చిత్రహింసలకు గురైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 21 రోజుల పాటు పాక్ నిర్బంధంలో ఉన్న ఆయనను ఎట్టకేలకు భారత అధికారులకు అప్పగించారు. పాకిస్థాన్ అధికారులు జవాన్ పూర్ణం కుమార్ షాను అదుపులోకి తీసుకున్న తర్వాత అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు ఆయన కళ్లకు గంతలు కట్టి ఉంచారని, నిద్రపోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని సమాచారం. అంతేకాకుండా పాక్ అధికారులు ఆయనను తరచూ మాటలతో దూషిస్తూ, మానసికంగా వేధించినట్లు కూడా తెలిసింది. ఈ దుర్భర పరిస్థితుల్లో మూడు వారాల పాటు నరకయాతన అనుభవించిన అనంతరం షా తిరిగి భారత గడ్డపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో షా పాకిస్థాన్ భూభాగంలోకి ఎలా వెళ్లారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, పాకిస్థాన్ అధికారులు ఒక భారతీయ సైనికుడి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా యుద్ధ ఖైదీల విషయంలో కూడా అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉండగా పొరపాటున సరిహద్దు దాటిన జవాన్ పట్ల ఇంతటి కఠినంగా ప్రవర్తించడం గమనార్హం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
భారత జవాన్‌ను చిత్రహింసలకు గురిచేసిన పాకిస్థాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES