– కార్యదర్శిగా కళ్యాణం నాగేశ్వర్ రావు ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏఐఎస్‌జీపీఎప్ జాతీయ ఉపాధ్యక్షుడుగా పాలకుర్తి క్రిష్ణమూర్తి, కార్యదర్శిగా కళ్యాణం నాగేశ్వర్ రావు ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ రెండవ జాతీయ మహాసభలు ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో జరిగాయి. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 13 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో టాప్ర ప్రధాన కార్యదర్శి పి.క్రిష్ణమూర్తి జాతీయ ఉపాధ్యక్షులుగా, టాప్ర ఉపాధ్యక్షులుగా కె.నాగేశ్వర్ రావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మహాసభల్లో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ 2005 ను వెంటనే రద్దు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల విభజన 1-1-2026కు ముందు, తరువాత అని తేడా లేకుండా అందరికీ ప్రయోజనాలు కల్పించాలని మహాసభ తీర్మానించింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సీవీపీ రికవరీ పీరియడ్‌ను 11 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. ”దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ పెన్షనర్లందరికీ కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన వైద్య విధానాన్ని అమలు పరచాలి. కంట్రిబ్యూషన్ లేని మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో తక్షణ ఉచిత వైద్యం కల్పించే విధంగా ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ సామాజిక న్యాయం, భద్రత, సంక్షేమం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని” డిమాండ్ చేశారు. ”నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్లకు కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైల్వే చార్జీ రాయితీలను పునరుద్ధరించాలి. విమాన చార్జీలులో రాయితీ కల్పించాలి. వివక్షత లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎప్పటికప్పుడు డీఆర్‌లు విడుదల చేయాలి. పెన్షనర్లకు ఆదాయ పన్ను మినహాయింపు సీలింగ్ తీసివేయాలి. కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి. పెరుగుతున్న ధరలను నియంత్రించాలి… ” అని మహాసభల్లో తీర్మానించారు.
ఏఐఎస్‌జీపీఎప్ జాతీయ ఉపాధ్యక్షుడుగా పాలకుర్తి క్రిష్ణమూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



