ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
ఈ రెండేండ్లలో పెద్దపీట వేశామని కాంగ్రెస్ అనడం హస్యాస్పదం
నిర్దిష్ట సమయం పెట్టుకుని పెండింగ్ పనులు పూర్తి చేయాలి
ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే ‘వీబీజీరామ్‌జీ’ : వనపర్తిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- వనపర్తి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఉమ్మడి జిల్లా వాసులకు నీరివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ సమావేశం డి.బాల్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం రూ.74 వేల కోట్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో రూ.32 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పెద్దపీట వేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్దపీట వేస్తే ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా పాలమూరు బీడు భూములకు సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అశాస్త్రీయ పద్ధతిలో మాట్లాడటం సరికాదన్నారు. ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు, చిన్న కాల్వలు మొదలు కాలేదని, ప్రధాన కాలువలే పూర్తి చేయకుండా బీడు భూములకు నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు. నిర్దిష్టమైన సమయం పెట్టుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని, లేకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ విషయంలో రెండు కార్డుల విధానం సరికాదని, పాత విధానాలనే అమలు చేసి జర్నలిస్టుందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అసెంబ్లీ సమావేశంలో చర్చలకే పరిమితం కాకుండా కేంద్రంపై పోరాటాలకు సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని పిలవాలని కోరారు. పాలమూరు వంటి వలసల జిల్లా ఆకలిని తీర్చే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేసేందుకు వీబీజీరామ్‌జీ పేరిట కొత్త పథకాన్ని తెచ్చిందని విమర్శించారు. ఈ బిల్లు ద్వారా చేసిన పనులకు 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బార్, ఏ.లక్ష్మీ, జిఎస్.గోపి, పరమేశ్వరచారి, మేకల ఆంజనేయులు, మహబూబ్ పాషా, ఎం.కృష్ణయ్య, బాల్యనాయక్, గుంటి వెంకటయ్య, ఆర్‌ఎన్.రమేష్, వెంకట్ రాములు ఉన్నారు.



