ముందుకు సాగని ప్రాజెక్టు పనులు
రాజకీయ విమర్శలకే అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పరిమితం
పదేండ్ల బీఆర్‌ఎస్… రెండేండ్ల కాంగ్రెస్ పానలలోనూ నిర్లక్షం
మా హయాంలో సగం చేశామని బీఆర్‌ఎస్..
ఏమి చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రశ్నలు
మొదలుకాని మోటార్లు, నీటికి నోచుకోని రిజర్వాయర్లు
డిండి ప్రాజెక్టుపై రైతుల ఆగ్రహం
పనులు పూర్తి చేసి వచ్చే ఏడాదిలోపు సాగు నీరు ఇవ్వాలి : జాన్‌వెస్లీ
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు రాజకీయ ఎజెండాగా మారింది. దీనిచుట్టే అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. మూడేండ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు పనులు పదమూడేండ్లైనా ఎందుకు పూర్తికాలేదనేది పాలకులకు పట్టని విషయం. రాజకీయంగా మైలేజీ పొందడం కోసం ఆరాటం తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపన గత, ప్రస్తుత ప్రభుత్వానికీ లేదనేది సత్యం. వలసలకు పేరుగాంచిన పాలమూరు ప్రజలకు సాగు, తాగునీరందించే ప్రాజెక్టుల పట్ల తీవ్ర నిర్లక్షం కొనసాగుతుంది.
అధికారంలో ఉన్నన్నిరోజులు పూర్తి చేయకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని అధికార కాంగ్రెస్ పార్టీ అంటుంటే,.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా.. తట్టెడు మట్టి తీయలేదని బీఆర్‌ఎస్ పార్టీ అంటోంది. రెండు పార్టీల వాదలనలోనూ నిజం లేకపోలేదు. ఎందుకంటే పడకేసిన ప్రాజెక్టు పనులు మన కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య హాట్‌హాట్‌గా మాటల యుద్ధం నడస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాల వాటాల ఆంశాలే ప్రధాన ఎజెండా కాబోతుంది.
నవతెలంగాణ- ఎ. పరిపూర్ణ
2015 జూన్ 11న ఆనాటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వేనా దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మూడేండ్లలో పూర్తి చేసి 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని ఆనాడు కేసీఆర్ ప్రకటించారు. పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్న విమర్శలను కేసీఆర్ ప్రభుత్వం మూట్టకట్టుకుంది. చిన్న కాల్వలు తవ్వలేదు. ప్రధాన కాల్వలు కూడా అసంపూర్ణంగానే మిగిలి ఉన్నాయి. నాటి బీఆర్‌ఎస్ అయినా నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలైనా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చిత్తశుద్ది కనబరచడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఎందుకంటే సవరించిన అంచనాల ప్రకారం రూ.రూ.74 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులకు పదేళ్లు గడిచినా రూ.34 వేల కోట్ల మేరకే నిధులు ఖర్చు చేశారు. అంటే సగం నిధులు కూడా వెచ్చించలేదు. భూసేకరణ ప్రక్రియ అసంపూర్తిగానే ఉంది.
వీటిని పూర్తి చేసేదెప్పుడు…
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అప్రోచ్ కెనాల్ నుంచి రిజర్వాయర్లు నింపే ఓపెన్ కెనాల్ పనులు పూర్తి కాలేదు. మొదటి రిజర్వాయరు నార్లాపూర్ నుండి 16 కిలోమీటర్ల టన్నెల్, 8.3 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ పూర్తి చేయాల్సి ఉంది. ఓపెన్ కెనాల్ ఇంకా 2.50 కిలోమీటర్లు తవ్వాలి. 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉంది. లింకు కెనాల్ తీయకుండా ఉద్దండాపూర్ వరకు ఐదు రిజర్వాయర్లు నింపి సాగు నీరు ఇవ్వడం కష్టం. ముంపుకు గురైన సాగు భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు రెండేండ్లపాటు ఆందోళనలు చేశారు. రైతులు కోర్టుకు పోయారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేనా, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు నిండాలంటే ముందు కుడికిళ్ల దగ్గర ప్రధాన కాల్వ పూర్తి చేయాల్సి ఉంది.
ప్రధాన కాల్వల పనులు పూర్తి చేయాలి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 12.30 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం నెరవేరాలంటే ప్రధాన కాల్వలతో పాటు ప్రధాన కాల్వల డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు చిన్న కాల్వల ఊసే లేదు. ప్రధాన రిజర్వాయర్ల నుంచి మెయిన్ కాల్వల ద్వారా చిన్న కాల్వలు నిర్మించకుంటే వంద శాతం సాగు భూములకు నీరు అందడం కష్టమే. పదేండ్లయినా.. సాగు నీటి సరఫరాకు అవసరమైన చిన్న కాల్వలను తీయడానికి పాలకులు చర్యలు మొదలు పెట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రధాన కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటర్లపై దృష్టి పెట్టాలి. ప్రధాన కాల్వలు సైతం త్వరితగతిన పూర్తిచేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
లెక్కలు ఘనం అమలు శూన్యం
పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ లెక్కలు ఘనంగా ఉన్నాయి. అమలు మాత్రం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 90 టీఎంసీలతో12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మరో 7.15 టీఎంసీల నీరు తాగునీటికి ఉపయోగపడుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధమికంగా 35,200 కోట్లు ఖరారు చేశారు. తర్వాత 74వేల కోట్లకు అంచనాలకు పెంచారు. భూసేకరణ 27,047 ఎకరాలు కాగ ఇంకా 1750 ఎకరాలను సేకరించాల్సి ఉంది.
లిప్టులు ఇలా
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో ఐదు రిజర్వాయర్లు నిర్మాణం అవుతున్నాయి. మొదటి లిప్టు నార్లాపూర్ దగ్గర 9 మోటార్లు కాగా ఇప్పటి వరకు నాలుగు మోటార్లను సిద్ధం చేశారు.ఈ రిజర్వాయరు సామార్థ్యం 8.61 టీఎంసీలు కాగా రిజర్వాయరు పనులు పూర్తయినా..ఐదు మోటార్లను బిగించాల్సి ఉంది. ఏదుల రిజర్వాయరులో 10 మోటార్లకు గాను ఐదు సిద్ధం అయ్యా యి. ఇంకా ఐదు బిగించాల్సి ఉంది. 95 శాతం పనులు జరగాల్సి ఉంది. మూడో లిప్టు వట్టెం దగ్గర 10 మోటార్లకు గాను ఐదు సిద్ధం అయ్యాయి. 16.58 టీఎంసీల సామార్థ్యం కల్గిన రిజర్వాయరు పనులు 90 శాతం పూర్తయ్యాయి. కురుమూర్తి రాయ లిప్టు 19.5 టీఎంసీలు 80 శాతం పూర్తయ్యాయి. ఇక్కడ గ్రావిటీ ద్వారా నీటిని ఉద్దండాపూర్ వస్తాయి. ఉద్దండపూర్‌లో 6 మోటార్లకుగాను మూడు బిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.19.91 టీఎంసీలు కాగా 70 శాతం పనులు పూర్తయ్యాయి.
మొండి కేసిన డిండి పనులు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా వనపర్తి జిల్లా ఏదుల దగ్గర ఉండే రిజర్వాయరు నుంచి డిండి ద్వారా నల్లగొండ జిల్లాకు సాగునీరు ఇచ్చే డిండి ఎత్తిపోతల పనులు మొండికేశాయి. ముఖ్యంగా చారగొండ మండలం ఎర్రవెల్లి గోకారం రైతుల భూములు సేకరించొద్దంటూ… రైతులు గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన వచ్చే దాక పనులు చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో సాగునీటిపై ఆధారపడి 16 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఆయకట్టుకు సాగు నీరు అందాలంటే పాలమూరు ప్రాజెక్టులతో పాటు కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడం ద్వారా ఈ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశాలు ఉన్నాయి.
నిధులు ఇలా
పాలమూరు ప్రాజెక్టులకు నిధులు అత్యల్పంగా కేటాయించారు. కేటాయించిన నిధులు సైతం పూర్తి స్తాయిలో ఖర్చు చేయలేదు. కోయిల్‌సాగర్‌కు రూ.80.75 కోట్లు నిధులు కేటాయించి కేవలం రూ.33 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. భీమాకు రూ.631.23 కోట్లు కేటాయిస్తే.. రూ.63 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కోసం రూ.144 కేటాయించి రూ.47 కోట్లు ఖర్చు చేశారు. కల్వకుర్తికి రూ.800 కోట్లు ఖర్చు చేసి రూ.80 కోట్లు, డిండికి రూ.433 కోట్లు కేటాయించి రూ.133 కోట్లు, ఎస్‌ఎల్‌బీసీకి రూ.889 కోట్లు కేటాయించి కేవలం రూ.108 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేటాయించిన నిధులు చేసిన ఖర్చులు చూస్తే పాలమూరు ప్రాజెక్టులపై ఎంత ప్రేమ ఉందో మనకు అర్థం అవుతుంది. పాలమూరు రంగారెడ్డి రూ.1285 కోట్లు కేటాయించి కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పటికైనా ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేసి బీడు భూములకు నీరు అందేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
పనులు పూర్తి చేసి వచ్చే ఏడాదిలోపు సాగునీరివ్వాలి : జాన్‌వెస్లీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
గత ప్రభుత్వం తమ పాలనలోనే 90 శాతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేశామని చెబుతున్నారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.74 వేల కోట్లు కేటాయించి అందులో కేవలం రూ.32 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, పనులు మాత్రం 90 శాతం ఎలా పూర్తవుతాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్దపీట వేశామని చెబుతున్నారు. అంత ప్రాధాన్యత ఇస్తే పనులెందుకు పూర్తికాలేదు. ఇరు పార్టీలు కూడా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాయి.
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఏడాదిలోపు సాగునీరు ఇవ్వాలి. లేని పక్షంలో రైతుల ఆగ్రహనికి గురికాక తప్పదు.



