– రాజయ్య ఇప్పటికైనా కండ్లు తెరవాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కొన్ని కొరివి దయ్యాల వల్ల బీఆర్‌ఎస్ భ్రష్టుపడుతోందని, అందులో పెద్ద కొరివి దయ్యం పల్లా రాజేశ్వర్ రెడ్డి అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో రాజయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చాలా దిగజారి మాట్లాడారని విమర్శించారు. అయినా బీఆర్‌ఎస్ చాలా గ్రామాలలో ఉనికే లేదని, కనీసం ఆ పార్టీ బలపర్చిన వాళ్లు పోటీలలో కూడా లేరని అన్నారు. రాజకీయ పరిపక్వత కలిగిన నియోజకవర్గ ప్రజలు వారిని పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఓటేసి మెజార్టీ సర్పంచులను గెలిపించారని చెప్పారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో పల్లా చేరి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేశారని అందుకే కవిత దూరమైపోయారని అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చిందని, వీటన్నిటికీ కారణం పల్లా రాజేశ్వర్‌రెడ్డి అని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి సుద్ద పూసలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీలో రాజయ్యను జీరో చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. రాజయ్య ఇప్పటికైనా కండ్లు తెరిచి తనను తిట్టడం కాకుండా బీఆర్‌ఎస్‌లో, నీపై ఎం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మారు జోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మెన్ లావణ్య శిరీష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మంచాల ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు బెలిదే వెంకన్న, లింగాల జగదీష్ రెడ్డి, బూర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద కొరివి దెయ్యం పల్లా రాజేశ్వర్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



