జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్
ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం
నవతెలంగాణ – వనపర్తి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీకానున్న నేపథ్యంలో సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప్రచార సందర్భంగా కరపత్రాలు, పోస్టర్ల ముద్రణలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ఎక్కడ కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని సూచించారు. ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా ఖచ్చితంగా పేర్కొనాలని, ఎన్ని పేజీలు ముద్రించారు.
అందుకు తీసుకున్న పైకం ఎంత అనే వివరాలు ఫారం – బి లో చూపెట్టాలని సూచించారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే కరపత్రాలు, పోస్టర్లు ముద్రించాలి
- Advertisement -
- Advertisement -



