– గ్రామపంచాయతీ చట్టాలు తెలవకుండానే కొనసాగుతున్న ఉద్యోగులు
– ఒకరికి ఒక చట్టం, మరొకరికి మరోచట్టం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ డివిజన్ జిల్లా అధికారులు వారికి సంబంధించిన చట్టాలు తెలియకుండానే వారు ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని జిల్లాలోని పలువురు విమర్శిస్తున్నారు. ఒకరికి ఒక చట్టంగా, మరొకరికి మరో రకంగా చట్టాలను చెప్పడంతో జిల్లాలోని ప్రజలు విస్తు పోతున్నారు. తన భూమిని కబ్జా చేశారని తాను కొనుగోలు చేసిన సాదాబైనా కాగితం తో పాటు, నేను ఇతనికి ఈ స్థలాన్ని విక్రయించాను అని అమ్మిన వ్యక్తి వచ్చి చెప్పిన అధికారులు మాత్రం నమ్మడం లేదు, మాకు మీరు కచ్చితంగా కొనుగోలు చేసుకున్న భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న కాగితాలు చూపెడితేనే ఆ స్థలం మీదని లేకపోతే లేదని తెగేసి చెబుతున్న అధికారులు.
చట్టం పరిధిలో ఉన్న అంశాన్ని ఎందుకు ఆచరించరు .?
అధికారులు తమ విధులను వారు నిర్వహిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా చట్టం ప్రకారం వారు విధులను నిర్వహించలేకపోతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
తెలంగాణ నూతన గ్రామపంచాయతీ చట్టం, 2018 ప్రకారం, సెక్షన్ 114 ప్రకారం భవన నిర్మాణాలకు, ఏ చిన్న నిర్మాణం చేపట్టిన గ్రామపంచాయతీ అనుమతి అనుమతి తప్పనిసరి అని చెబుతోంది. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఏ నిర్మాణాన్ని నిర్మించకూడదు, పునర్నిర్మించకూడదు లేదా ఉన్న నిర్మాణానికి ఎలాంటి మార్పులు చేయకూడదు. అలా చేసిన సమయంలో గ్రామపంచాయతీ అధికారులు
చట్టవిరుద్ధంగా నిర్మించిన భవనాలను నిలిపివేయడం లేదా కూల్చివేయడం గ్రామపంచాయతీ బాధ్యత. అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగితే, వాటిని నిలిపివేయడానికి, తొలగించడానికి గ్రామ పంచాయతీకి అధికారం ఉంటుంది. గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శి, గరిష్టంగా గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు అంతస్తుల (G+2), 10 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలకు, 300 చదరపు మీటర్ల వరకు ఉన్న స్థలంలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వవచ్చు. దరఖాస్తు చేసుకున్న 24 గంటలలోపు సమర్పించిన పత్రాలను పరిశీలించి, ధృవీకరించాలి.
అలా నిర్మించిన వాటిపై జరిమానాలు, చర్యలు , అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను తొలగించడానికి గ్రామపంచాయతీకి అధికారం ఉంటుంది. ఒకవేళ గ్రామపంచాయతీ తన పరిధిలో అక్రమ నిర్మాణాలను నిలిపివేయడంలో విఫలమైతే, ఆ గ్రామపంచాయతీని రద్దు చేసే అధికారం కూడా ఈ చట్టంలో ఉంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 114 భవన నిర్మాణాలను నియంత్రించడం తో పాటు అక్రమ నిర్మాణాలను నిరోధించడంపై గ్రామపంచాయతీలకు స్పష్టమైన అధికారాలు, బాధ్యతలు విధులను అప్పగిస్తుంది. ఈ చట్టాలపై గ్రామపంచాయతీ అధికారులు అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.