Wednesday, October 22, 2025
E-PAPER
Homeఆటలుపంత్‌ వచ్చేశాడు

పంత్‌ వచ్చేశాడు

- Advertisement -

వికెట్‌ కీపర్‌కు భారత్‌-ఏ కెప్టెన్సీ
దక్షిణాఫ్రికా-ఏతో సిరీస్‌కు జట్టు ఎంపిక
ముంబయి :
దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో తలపడే రెండు మ్యాచుల రెడ్‌బాల్‌ సిరీస్‌కు స్టార్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో ‘టెండూల్కర్‌-అండర్సన్‌’ ట్రోఫీలో బ్యాటింగ్‌ చేస్తూ పాదం గాయానికి గురైన రిషబ్‌ పంత్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. బెంగళూర్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)లో రెండు దశల రిహాబిలిటేషన్‌లో రిషబ్‌ పంత్‌కు వైద్య బృందం ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. దీంతో బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ రిషబ్‌ పంత్‌ను భారత్‌-ఏ సిరీస్‌కు తీసుకున్నారు. స్వదేశంలో జరుగనున్న దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో రీ ఎంట్రీ ఆశిస్తున్న రిషబ్‌ పంత్‌.. సఫారీ-ఏ జట్టుతో సిరీస్‌లో ఫిట్‌నెస్‌, ఫామ్‌ నిరూపించుకోవాల్సి ఉంది. సఫారీ-ఏతో సిరీస్‌లో రిషబ్‌ పంత్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు పునరాగమనం లాంఛనమే కానుంది. భారత్‌, దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్ల నాలుగు రోజుల మ్యాచులు బెంగళూర్‌లోని సీఓఈలో జరుగనుండగా.. రంజీ ట్రోఫీ రెండో రౌండ్‌లో ఢిల్లీ తరఫున ఆడేందుకు సిద్ధమైన రిషబ్‌ పంత్‌ ఇప్పుడు సొంత రాష్ట్ర రంజీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. భారత్‌-ఏ, దక్షిణాఫ్రికా-ఏ తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 2 వరకు, రెండో మ్యాచ్‌ నవంబర్‌ 6 నుంచి 9 వరకు జరుగుతాయి. భారత్‌, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ నవంబర్‌ 14న ఈడెన్‌గార్డెన్స్‌ టెస్టుతో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

భారత్‌-ఏ జట్టుకు పంత్‌ కెప్టెన్‌గా ఎంపికవగా.. బి. సాయి సుదర్శన్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కెఎల్‌ రాహుల్‌, ధ్రువ్‌ జురెల్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌లు సైతం సఫారీ-ఏతో రెడ్‌బాల్‌ మ్యాచ్‌లో ఆడనున్నారు. కంగారూ గడ్డ నుంచి స్వదేశం చేరుకున్న తర్వాత రెండో మ్యాచ్‌లో రాహుల్‌, ధ్రువ్‌, ప్రసిద్‌ కృష్ణ, సిరాజ్‌లు ఆడతారు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ జరుగుతున్న సమయంలో రాష్ట్ర జట్ల సమతూకం దెబ్బతినకుండా భారత్‌-ఏ జట్టును అజిత్‌ అగ్కార్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ ఈ క్రికెటర్లను కేవలం ఒక్క మ్యాచ్‌కే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న రజత్‌ పాటిదార్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిమన్యు ఈశ్వరన్‌, ఆకాశ్‌ దీప్‌లను సెలక్షన్‌ కమిటీ భారత్‌-ఏకు ఎంపిక చేయలేదు. ఎన్‌ జగదీశన్‌, మానవ్‌ సుథర్‌, సురాన్షు జైన్‌, హర్ష్‌ దూబెలు దేశవాళీ ప్రదర్శనతో భారత్‌-ఏ జట్టులోకి ఎంపికయ్యారు.

భారత్‌-ఏ జట్టు : తొలి మ్యాచ్‌
రిషబ్‌ పంత్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఆయుశ్‌ మాత్రె, ఎన్‌ జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), సాయి సుదర్శన్‌ (వైస్‌ కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, హర్ష్‌ దూబె, తనుశ్‌ కొటియన్‌, మానవ్‌ సుథర్‌, అన్షుల్‌ కంబోజ్‌, యశ్‌ ఠాకూర్‌, ఆయుశ్‌ బదొని, సరాన్షు జైన్‌, గుర్మూర్‌ బరార్‌, ఖలీల్‌ అహ్మద్‌.

భారత్‌-ఏ జట్టు : రెండో మ్యాచ్‌
రిషబ్‌ పంత్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), కెఎల్‌ రాహుల్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), సాయి సుదర్శన్‌ (వైస్‌ కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, హర్ష్‌ దూబె, తనుశ్‌ కొటియన్‌, మానవ్‌ సుథర్‌, ఖలీల్‌ అహ్మద్‌, గుర్మూర్‌ బరార్‌, అభిమన్యు ఈశ్వరన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -