నేడు దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్
ఉదయం 9.00గం||ల నుంచి
గౌహతి: తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియా రెండోటెస్ట్‌కు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టెస్ట్ సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా గెలుపు తప్పనిసరి. శనివారంనుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ పగ్గాలు అందుకున్నాడు. గిల్ స్థానంలో సాయి సుదర్శన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ జరుగుతున్న తరుణంలో.. భారత జట్టు ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అలాగే ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఖాయం.
ఆల్‌రౌండర్ అక్షర్, జడేజాలకు రాణించాల్సి సమయం ఆసన్నమైంది. తుది జట్టులోకి సాయి సుదర్శన్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించారు. సాయి, పడిక్కల్ రాకతో జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుందని.. అందుకే ధ్రువ్ జురెల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే సరిపోతుంది. కోల్‌కత్తా టెస్ట్‌లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయడంతో పాటు 26, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారతజట్టు సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. గౌహతిలో వాతావరణ పరిస్థితుల రీత్యా అరగంట ముందే మ్యాచ్ ప్రారంభం కానుంది. అలాగే లంచ్ విరామానికి ముందు టీ సెషన్ ఉండనున్నట్లు బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది.
జట్లు(అంచనా)..
ఇండియా: పంత్(వికెట్ కీపర్, కెప్టెన్), జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, జురెల్, సుందర్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
దక్షిణాఫ్రికా: బవుమా(కెప్టెన్), రికెల్టన్, మార్‌క్రమ్, జోర్జి, స్టబ్స్, వెర్రెయనే(వికెట్ కీపర్), జాన్సెన్, ఎన్గిడి, హేర్మర్, మహరాజ్.



