ఆ గడ్డి మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలి
ఈ అంశాన్ని చట్టసభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేవనెత్తాలి : ఐఎమ్‌ఏ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సైనేడ్ కన్నా పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) అత్యంత ప్రమాదకమైందనీ, ఆ గడ్డి మందును దేశవ్యాప్తంగానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. గడ్డిమందుపై నిషేధం విధించే అంశాన్ని చట్టసభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేవనెత్తాలని కోరింది. మంగళవారం హైదరాబాద్‌లోని కోఠిలో ఐఎమ్‌ఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి.కిషన్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
అందులో తెలంగాణ రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్వ, రాజ్యసభ సభ్యులు బి.సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఐఎమ్‌ఏ గౌరవ కార్యదర్శి డాక్టర్ వి.అశోక్, కోశాధికారి డాక్టర్ టి.దయాల్‌సింగ్, డాక్టర్ డి.ద్వారకనాథరెడ్డి, సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గంగాధర్, గాంధీ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టి.కృపాల్ సింగ్, టీజీఎంసీ వైస్ చైర్మెన్ డాక్టర్ జి.శ్రీనివాస్, డీఏపీపీ గౌరవాధ్యక్షులు డాక్టర్ మర్రి మహేష్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ రాకేష్ చెన్నా(నెఫ్రాలజిస్ట్), డాక్టర్ సన్నీ డేవిస్, గడ్డి మందు బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చారు. పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డిమందు)ను నిషేధించాల్సిన ఆవశ్యకతను ముక్తకంఠంతో నొక్కి చెప్పారు.
పెస్టిసైడ్, పెట్రోకెమికల్, ఫార్మాసిటికల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..గత వారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలోనే గడ్డిమందును నిషేధించాలనే డిమాండ్‌ను పెట్టానని తెలిపారు. నిషేధించే దిశగా చర్యలు సాగుతున్నాయని చెప్పారు. గడ్డిమందు తాగివాళ్లంతా చనిపోతున్నారనీ, ఈ మధ్య కాలంలో రైతులు, కౌలురైతులకంటే ఎక్కువగా ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఎక్కువమంది బలవంతంగా చనిపోతున్నారని వివరించారు. గడ్డిమందు నిషేధం కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. తెలంగాణ రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి మాట్లాడుతూ…మల్టీనేషనల్ కంపెనీ వాళ్ల కోసం ఇలాంటి మందులకు అనుమతి ఇస్తున్నారనీ, గడ్డి మందు వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కల్తీ ఎరువులు, రసాయన మందులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎత్తిచూపారు. గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌లను కలిసి వినతిపత్రం అందజే స్తామని చెప్పారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..గడ్డిమందు నిషేధంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీనిచ్చారు. ప్రమాదకరమైన ఇలాంటి మందులను అమెజాన్ లాంటి ఆన్‌లైన్ వేదికగా విక్రయించడం బాధాకరమని తెలిపారు. మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు పెరగడానికి గడ్డి మందు కూడా కారణమని చెప్పారు. పారాక్వాట్ నిషేధించాలనే పోరాటానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
పారాక్వాట్ ప్రభావం ఇదే..
-పారాక్వాట్ గడ్డిమందు వంద శాతం విషపూరితమైంది.
-8 నుంచి 15 ఎమ్‌ఎల్ తీసుకున్నా మనిషి చనిపోయే ప్రమాదం.
-వెంటనే ఊపిరితిత్తులు పాడైపోతాయి. కిడ్నీలు పనిచేయవు. గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది.
-దానికి ప్రత్యామ్నాయ విరుగుడు మందు లేదు
-70కిపైగా దేశాలు దానిపై నిషేధం విధించాయి.
-దక్షిణ కొరియాలో ఆ మందును నిషేధించిన తర్వాత ఆత్మహత్యల ద్వారా సంభవించే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
-మన దేశంలో ఇప్పటికే కేరళ, ఒడిశా ప్రభుత్వాలు ఆ మందును నిషేధించాయి.



