– ‘కాళోజీ’ వైద్య విద్య ప్రవేశాల నిబంధనలపై ఆందోళన
– ‘శ్రేష్ట’ దళిత విద్యార్థుల స్థానికత ఎక్కడీ
– గత ఏడాదీ ఇదే సమస్య… పరిష్కరించని ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డాక్టర్లు కావాలనుకునే విద్యార్థుల కలల్ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కాలరాస్తోంది. గత ఏడాది చేసిన తప్పునే ఇప్పుడూ కొనసాగిస్తోంది. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన నిబంధన ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు కష్టాన్ని, నష్టాన్ని తెచ్చిపెడుతోంది. గతేడాది 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులను స్థానికులుగా గుర్తిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఫలితంగా పలువురు విద్యార్థులు తాము తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు స్థానికులం కాకుండా పోతున్నామని ఆందోళన చేపట్టారు. ఆ నిబంధనను మార్చాలని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కానీ ఈ ఏడాది కూడా అదే నిబంధనను కొనసాగిస్తూ, నోటిఫికేషన్ ఇచ్చారు. దీనితో ఈ ఏడాది కూడా రాష్ట్ర విద్యార్థుల్లో అదే గందరగోళం నెలకొంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ సరిహద్దు గ్రామాల విద్యార్థులు ఉత్తమ చదువుల కోసం టెన్త్, ఇంటర్ పొరుగురాష్ట్రాలకు వెళ్లి చదువుకుంటారు. అలాగే తెలంగాణ విద్యార్థులు విజయవాడ, గుంటూరు, కర్నూల్ వంటి జిల్లాల్లో టెన్త్, ఇంటర్ చదివేందుకు వెళ్తారు. ఆదిలాబాద్ విద్యార్థులు నాగ్‌పూర్ వెళ్లి చదువుకుంటారు. 2023-24 విద్యాసంవత్సరం వరకు స్థానికత నిర్థారణకు 6 నుంచి 12వ తరగతి వరకు ఏడేండ్లలో నాలుగేండ్లు వరుసగా ఎక్కడ చదివితే దాన్నే స్థానికతగా పరిగణించేవారు. కానీ గత ఏడాది నుంచి నీట్ నోటిఫికేషన్‌లో ‘స్థానికత’ నిర్థారణలో మార్పులు తీసుకొచ్చారు. ఫలితంగా పలు జిల్లాల విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదనే ఆందోళన వ్యక్తం అవుతున్నది.
జీవో 33 సవరించాలి
గత ఏడాది వైద్యారోగ్యశాఖ జారీ చేసిన జీవో 33ని సవరించాలని ఇప్పటికే పలుమార్లు ‘నీట్’ పరీక్ష రాసిన విద్యార్థులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీనికోసం తమిళనాడులో అవలంబిస్తున్న విధానాన్ని పరిశీలించాలనీ సూచించారు. తమిళనాడులో ఎంబీబీఎస్ స్థానిక కోటాలో సీటు కోసం దరఖాస్తు చేసే అభ్యర్థి ఆరు నుంచి పది వరకు ఆ రాష్ట్రంలో చదువుకుని ఉండాలనీ, వారి తల్లిదండ్రులు తమిళనాడులో స్థిరనివాసులై ఉండాలనే నిబంధన పెట్టారు. తెలంగాణలో మాత్రం అలాంటి నిబంధన లేకపోవడంతో పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ ఉదాహరణలు…
కొత్తగూడెంకు చెందిన ఒక విద్యార్థి పదవ తరగతి వరకు స్థానికంగా చదువుకోగా, ఇంటర్మీడియట్ విద్యను విజయవాడలో పూర్తి చేశారు. మంచిర్యాలకు చెందిన మరో అభ్యర్థి ఇంటర్మీడియట్‌ను వేరే రాష్ట్రంలో పూర్తి చేశారు. మరికొందరు ఇంటర్మీడియట్‌ను తెలంగాణలో పూర్తి చేయగా, కుటుంబ పరిస్థితుల కారణంగా 9, 10 తరగతులను వేరే రాష్ట్రాల్లో పూర్తి చేశారు. వీరితో పాటు 9 నుంచి ఇంటర్ వరకు ఇతర రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. దీనివల్ల తల్లిదండ్రులు తెలంగాణలో స్థానికులుగా ఉంటే, వారి పిల్లలు స్థానికేతరుల కోటాలోకి వెళ్లిపోతున్నారు. దీనిపై గతేడాది పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడంతో, స్థానికత నిర్ధారణకు మార్గదర్శకాలు రూపొందించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో తాత్కాలికంగా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు బ్రేక్ పడింది. అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు స్థానిక కోటా వర్తింపజేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో, గతేడాది అడ్మిషన్ల ప్రక్రియకు గ్రీన్ సిగల్ వచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26) మళ్లీ పాత నోటిఫికేషనే ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ లెక్క..
రాష్ట్రంలో 8,415 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 15 శాతం అంటే 637 సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను స్థానికంగా భర్తీ చేస్తారు. ప్రయివేటు వైద్య కళాశాలల్లో 50 శాతం సీట్లను కౌన్సిలింగ్ ద్వారా, మిగతా 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా ద్వారా కాళోజీ యూనివర్సిటీయే భర్తీ చేస్తుంది. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు కోసం రాష్ట్రంలో ఈనెల 16 నుంచి అభ్యర్థుల రిజిస్ట్రేషన్ మొదలైంది. ప్రభుత్వం ‘స్థానికత’ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
‘శ్రేష్ట’ విద్యార్థులు స్థానికులు కారా?
కేంద్ర సామాజిక సాధికారిత మంత్రిత్వశాఖ దళిత విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ‘శ్రేష్ట’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద ఏటా దాదాపు 3 వేలమంది దళిత విద్యార్థినీ, విద్యార్థులను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఇంటర్నేషనల్ స్కూళ్లలో 9, 11 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నది. మన రాష్ట్రం నుంచి కూడా దళిత విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో సీట్లు పొందారు. కొందరు విద్యార్థులు 9వ తరగతిలో సీటు పొంది 12వ తరగతి వరకు చదువుతుండగా, మరి కొంత మంది 11వ తరగతిలో సీటు పొంది ఇంటర్మీడియట్‌ను అక్కడే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనతో తాము కూడా స్థానిక కోటాకు అర్హత కోల్పుతున్నామని ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తల్లిదండ్రులు లోకల్…పిల్లలు నాన్‌లోకల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES