రూ.40వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
నవతెలంగాణ-పరిగి
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఓ అధికారి రూ.40వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగికి చెందిన ఒక వ్యక్తి అటవీ ప్రాంతాల్లో దొరికే సీతాఫలాలు అమ్మడానికి టెండర్‌లో పాల్గొన్నాడు. టెండర్ వ్యాల్యూ రూ.15 లక్షలు జీఎస్టీతో కలిపి మొత్తం రూ.18 లక్షల వరకు చెల్లించాడు. ఈ సీతాఫలాలు ట్రాన్స్‌పోర్టు చేయడానికి ఫారెస్ట్ ఆఫీస్ నుంచి పర్మిట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిట్ ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్, మైనుద్దీన్ ఇబ్బంది పెట్టారు. పర్మిట్ ఇవ్వకుండా వాహనాలను ఆపడంతో రాత్రంతా అవి అలాగే ఉన్నాయి. దాంతో సీతాఫలాలు డ్యామేజ్ అవడంతో అతనికి నష్టం వాటిల్లింది. బాధితుడు అధికారుల దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. అయితే అధికారులు రూ.50వేలు ఇస్తేనే పర్మిట్ ఇస్తామని తెలిపారు. దాంతో రూ.40వేలు ఇస్తానని బాధితుడు అధికారు లతో ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా, శుక్రవారం బాధితుని నుంచి అటవీ శాఖ అధికారి మహమ్మద్ మైనుద్దీన్ డ్రైవర్ సాయంతో డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్, మహమ్మద్ మైనుద్దీన్, డ్రైవర్ బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో ఎఫ్‌ఆర్‌ఓ ప్రమేయం ఉందా.. లేదా అనే దానిపై కూడా విచారిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఏసీబీకి చిక్కిన పరిగి ఫారెస్ట్ అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES