– ఏడేండ్లలో 522 శాతం పెరిగిన ఖర్చులు
– 2018లో రూ.3.67 కోట్లు.. 2025 నాటికి రూ.18.82 కోట్లు
– ప్రధాని మోడీకి ప్రచార ఈవెంట్‌గా మారిన కార్యక్రమం
– మరోపక్క నిధుల లేమితో పలు విద్యా పథకాలకు ఆటంకాలు
– కేంద్రం తీరుపై మేధావులు, విద్యావేత్తల ఆందోళన
దేశంలో ‘పరీక్షా పే చర్చ’ పేరుతో స్కూల్ విద్యార్థులతో ప్రధాని మోడీ ప్రతీ ఏడూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. పరీక్షల్లో చిన్నారులకు భయాలు పోగొట్టేలా సలహాలు, సూచనలు ఇవ్వటమే దీని ముఖ్యోద్ధేశమని కేంద్రం చెప్తుంటుంది. ఈ కార్యక్రమం కోసం కేటాయించే బడ్జెట్ మాత్రం ఏటికేడూ పెరిగిపోతున్నది. ఇది గత ఏడేండ్లలో 500 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద ఈ సమాచారం వెల్లడైంది. ఒకపక్క విద్యార్థుల కోసం ఉద్దేశించిన పథకాలు మాత్రం నిధుల లేమితో ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు ఉపయోగపడే పథకాలను పక్కనబెట్టి.. పరీక్షా పే చర్చ వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్న మోడీ సర్కారు తీరును మేధావులు, విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
న్యూఢిల్లీ : పరీక్షా పే చర్చ కార్యక్రమం 2018లో ప్రారంభమైంది. ఆ ఏడాది దీనికి రూ.3.67 కోట్లను కేటాయించారు. ఇది 2025 నాటికి అది కాస్తా రూ.18.82 కోట్లకు ఎగబాకింది. అంటే ఏడేండ్లలో 522 శాతం పెరుగుదలను నమోదు చేసింది. పరీక్షా పే చర్చలో భాగంగా మోడీ ఫోటోలతో ఉండే సెల్ఫీ పాయింట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఒక్క 2023, 2024 ఏడాదుల్లో జరిపిన కార్యక్రమాల్లోనే దేశవ్యాప్తంగా 1111 సెల్ఫీ పాయింట్లు ఏర్పాటయ్యాయి. జీఎస్టీని మినహాయిస్తే ఇందుకు అయిన ఖర్చు అక్షరాలా రూ.2.49 కోట్లు. పరీక్షాపే చర్చకు గతేడాది అయిన ఖర్చు రూ.6.5 కోట్లకు పెరగటం గమనార్హం. కేవలం ఒక్కరోజు జరిగే ఈ కార్యక్రమానికి రూ.కోట్లల్లో ఖర్చు పెట్టటంపై మేధావుల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌కు రూ.6 కోట్లు
కరోనా పరిస్థితుల కారణంగా 2021లో పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ మోడీ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. అయితే, ఈ కార్యక్రమానికి రూ.6 కోట్లు కేటాయించటం గమనార్హం. కేంద్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేస్తూ మోడీకి ఒక పబ్లిసిటీని కల్పించే ఈవెంట్‌గా మార్చిందనే విమర్శలూ ఉన్నాయి.
కేంద్రం వద్ద లేని సమగ్ర వివరాలు
అయితే, ఈ కార్యక్రమం కింద అన్ని ఎడిషన్లకు సంబంధించిన సంపూర్ణ సమాచారం మాత్రం ప్రభుత్వం వద్ద అందుబాటులో లేకపోవటం గమనార్హం. పరీక్షా పే చర్చలో.. ఈవెంట్ నిర్వహణ, వేదిక రిజర్వేషన్, ఇంటర్నెట్ సదుపాయం, మొబైల్ పారిశుధ్య సౌకర్యాలు, ప్రకటనలు, క్యాటరింగ్, ఆడియో-విజువల్ సేవలు, చలనచిత్ర నిర్మాణం, సోషల్ మీడియా మార్కెటింగ్, రవాణా బాధ్యతలను బాహ్య సంస్థలు నిర్వహిస్తాయని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, ప్రతీ సర్వీసుకూ జరిపిన చెల్లింపులకు సంబంధించి బిల్లులు, ఇన్‌వాయిస్‌లను బహిర్గతం చేయటానికి ‘గోప్యత’ను కారణంగా చూపెడుతూ ప్రభుత్వం నిరాకరించటం గమనార్హం.
నిధులు నిల్.. పథకాలు డల్
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఉద్దేశించిన పథకాలు మాత్రం నిధులకు నోచుకోలేకపోతున్నాయి. ఇందులో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం, ప్రధాన మంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వంటివి ఉన్నాయి. 2018-19లో ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అంచనా వేసిన బడ్జెట్ రూ.559.55 కోట్లు. అయితే, ఇది 2025-26లో రూ.429 కోట్లకు తగ్గింది. ఈ తగ్గుదల 23.2 శాతం అన్నమాట. ఇక నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) 2021 నుంచి నిలిచిపోయింది. 1963 నుంచి ఈ పరీక్షను నిర్వహించేవారు. ఇందులో దాదాపు రెండువేల మంది ప్రతిభావంతులైన పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రతినెలా స్కాలర్‌షిప్‌లు అందించేవారు. అలాగే, పీజీ స్థాయి వరకు మెంటర్‌షిప్‌ను అందించేవారు. ఇక మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ గతేడాది డిసెంబర్ నుంచి ఆగిపోయింది. దీంతో ఈ ప్రోగ్రామ్ కింద పీహెచ్‌డీలు చేసే మైనారిటీ స్కాలర్స్ నష్టపోతున్నారు. ఇక నిధుల లేమి కారణంగా వెనకబడిన వర్గాలకు చెందిన దాదాపు 60 శాతం మంది విద్యార్థులకు విదేశీ చదువుల కోసం అందించే స్కాలర్‌షిప్‌ను కూడా మోడీ సర్కారు నిలిపివేయటం గమనార్హం.
‘విద్యార్థుల సమస్యలు, పథకాల అమలుపై దృష్టి పెట్టాలి’
ఇలా ఇంకా ఎన్నో విద్యా పథకాలు నిధులు లేని కారణంగా, ప్రభుత్వం దృష్టిని సారించని కారణంగా నిలిచిపోవటమో, అవరోధాలను ఎదుర్కోవటమో జరుగుతున్నాయి. ఇలాంటి ప్రభుత్వ పథకాల మీద ప్రధానంగా పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఆధారపడగారు. కానీ, మోడీ సర్కారు నిర్లక్ష్యపూరిత వైఖరి కారణంగా ఈ పథకాల ఫలాలు వారికి అందటం లేదని మేధావులు, విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి పరీక్షా పే చర్చ పేరుతో ప్రధాని మోడీకి ప్రచారాన్ని కల్పించే కార్యక్రమాలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. దేశంలో విద్యార్థులు ఎన్నో సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందులో స్కూల్ డ్రాపౌట్లు, సమయానికి విడుదలకాని స్కాలర్‌షిప్‌లు, పేపర్ లీక్‌లు, పరీక్షల్లో పారదర్శకత లోపించటం వంటివి ఉన్నాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇలాంటి కీలక సమస్యలపై ప్రధాని ప్రధానంగా దృష్టిసారించాలని విద్యావేత్తలు, మేధావులు సూచిస్తున్నారు. దానిని మరిచి.. ఇలాంటి కార్యక్రమాలతో ప్రసంగాలివ్వటం, మోడీ చిత్రాలతో సెల్ఫీలకు ప్రాధాన్యతనివ్వటం ద్వారా ఎలాంటి ఉపయోగమూ ఉండదని వారు అంటున్నారు.
సెల్ఫీపాయింట్లకు విచ్చలవిడిగా ఖర్చు
ప్రధాని మోడీ చిత్రాలతో కూడిన 1111 సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు ప్రభుత్వం 2023, 2024 ఏడాదుల్లో రూ.2.49 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 3డీ సెల్ఫీ యూనిట్ ఏర్పాటు ఖర్చు రూ.1.25 లక్షలు కాగా, 2డీ సెల్ఫీ యూనిట్ ధర రూ.15వేల నుంచి రూ.21 వేల వరకు ఉన్నది. 2021 నుంచి 2024 వరకు పరీక్షా పే చర్చ డిజిటల్ ప్రమోషన్ కోసం ప్రభుత్వం రూ.2.44 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి అందించే సర్టిఫికెట్ల ముద్రణకే రూ.6.19 కోట్లు ఖర్చు కావటం గమనార్హం.