విదియనాడు కనిపించని చంద్రుడు తదియనాడు తానే కనిపిస్తాడన్నట్టు తయారైంది తెలుగు రాష్ట్రాల్లో మత రాజకీయాల పరిస్థితి. టీడీపీ, జనసేన, వైసీపీలతో సహా ఇందులో భాగమవుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల యుద్ధంలోనూ మతతత్వ వ్యతిరేకత ఎజెండా లోంచి మాయమై బీజేపీ, మజ్లిస్‌లు కాలూను తున్నాయి. తమ తమ స్థానిక ఆధిపత్యాల కోసం ఈ పార్టీలు పోటీలు పడుతుంటే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు బీజేపీ, ఆరెస్సెస్‌లు పట్టు పెంచుకోవడానికి సమాలోచనలు చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకోసం ప్రత్యేకంగా ఆలయాలు, కులమతాలు, ఆహారాలు, సినిమాలు మీడియా, పండగలు దేన్నీ వదలిపెట్టడం లేదని ఇటీవల చాలా ఉదంతాలు హెచ్చరిస్తున్నాయి. వామపక్షాలు అనవసరంగా బీజేపీ బోగీ తీసుకొస్తున్నాయనే మాటలు ఎంత అనాలోచితమో ఈ సందర్భాలు స్పష్టం చేస్తాయి.
ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వరకూ దేశవ్యాపితంగా అనేకచోట్ల అగ్గిరాజేసిన విద్వేష రాజకీయం ఇప్పుడు ఆంధ్రా యూనివర్సిటీలోనూ ప్రత్యక్షమైంది. అంతర్జాతీయ స్థాయి నౌకాదళ విన్యాసాలు జరుగుతున్నప్పుడే కుహనా జాతీయవాదం సనాతన మతవాదం మేళవించిన ఆరెస్సెస్ కవాతు తలపెట్టడం యాదృచ్చికమేమీ కాదు. ఎస్‌ఎఫ్‌ఐ వంటి విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలూ కుట్రపన్నాయని ఆరోపించడం మరింత దారుణం. దీనికి ముందే ప్రసిద్ధ మేడారం జాతరలో సంప్రదాయకంగా కోవాబన్ను అమ్మే చిరు ముస్లిం వ్యాపారులపై నిందలు వేసి దాడులు చేశారు. అనివార్య పరిస్థితులలో మంత్రి లోకేశ్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వంటివారు కూడా దీన్ని ఖండించ వలసి వచ్చిందిగానీ వెనక వున్న మతతత్వ పోకడలను మాత్రం వారు అసలు ప్రస్తావించలేదు. పైగా సోషల్ మీడియాలో ఈదాడిని సమర్థిస్తూ రకరకాల వ్యక్తులు వ్యాఖ్యలు పెట్టారు. ఇదే తరుణంలో హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభలోనూ ఇదే ధోరణి శ్రుతిమించింది.
ఇళ్లలో రిపేర్లు, చిన్న చిన్న పనులు చేసి పెట్టేవారంతా అన్యమతస్తులేనని ద్వేషవాక్కులు వినిపించాయి. సభలో మాట్లాడిన పూజారులతో సహా విదేశీయులను తరిమి కొట్టాలని రెచ్చిపోయారు. షరామామూలుగా మునిసిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు కేంద్ర మంత్రులతో సహా విద్వేషవ్యాఖ్యలే చేశారు. ఫలితాల్లోనూ ఆ ప్రభావం కొన్నిచోట్ల కనిపించింది. బీజేపీ అనుకున్న స్థాయిలో విజ యాలు సాధించకపోయినా కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ అక్కడ తటస్తవైఖరి తీసుకుంది. బైంసాలో మజ్లిస్ తిరుగుబాటు అభ్యర్థులు అందరి మద్దతుతో పీఠమెక్కారు. కొత్తగూడెంలో సీపీఐ మేయర్ ఎన్నికవడం మాత్రం వామపక్ష శక్తులకు సంతోషం కలిగించింది.అదే సమయంలో బీజేపీతో చేతులు కలిపినట్టు రాష్ట్ర వ్యాపితంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి తప్ప దాన్ని నిరోధించడమే కీలక సూత్రంగా పెట్టుకోలేదు. దేశమంతటా ఈ విషయంలో కాంగ్రెస్‌లో కనిపించే ఊగిసలాట లక్ష్యశుద్ధి లేకపోవడం వారు పాలించే తెలంగాణలోనూ ప్రతక్ష మైంది. బీఆర్‌ఎస్‌పైనా గతంలోనే ఆలాటి ఆరోపణ లున్నాయి.
లడ్డూ టు ఫుడ్డు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అంతకంతకూ బీజేపీ సనాతన జపం ఎక్కువ కావడం ఈ కాలంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పైగా ప్రధాని మోడీని మెప్పించడం కోసం పాలక కూటమి ప్రధాన ప్రతిపక్షం పోటీ పడుతున్న పరిస్థితి. తాజా బడ్జెట్‌లోనూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మోడీ నాయకత్వాన్ని రాష్ట్రానికి చేసిన సహాయాన్ని అనవసరంగా కీర్తించడం అందరూ గమనించారు. కేంద్ర బడ్జెట్‌లో రాజధానితో సహా ఏ అంశంలోనూ రావలసింది రాలేదనే వాస్తవాన్ని కప్పిపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు పొగడ్తలు గుప్పించారు. స్వయంగా సనాతన జపంలో మునిగితేలే ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అయితే అచ్చంగా అదే పనిలో వున్నారు.
రాజకీయ అవసరాల కోసం మాత్రమే గాక ఒక వ్యూహంగానూ మతపరమైన అంశాలపై రభస ఈ కాలంలో పెరిగింది. తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోగా పరస్పరం ఆరోపణలతో మతాలవారిగా, పార్టీల పరంగా చిచ్చు రగిలిస్తూనే వున్నారు. ఈ కాలమంతటా తిరుపతి పాలకమండలిలో కొనసాగుతున్న బీజేపీ తనకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ అక్కడ పట్టు కాపాడుకోవడంలో నిమగమైంది. నిజానికి ఈ రెండు ప్రభుత్వాల హయాంలోనూ కొండపై తిష్టవేసింది హిందూత్వ సంస్థలూ, మఠాల లాబీయిస్టులే. వ్యాపార కార్పొరేట్ బ్యూరోక్రాట్ల పట్టు కూడా అదే స్థాయిలో సాగుతున్నది. మతం చుట్టూ తిరిగిన ఈ వివాదం ఇప్పుడు హెరిటేజ్ కంపెనీకి సంబంధం వుందనే విధంగా వైసీపీ ఆరోపిస్తుంటే ఆ కంపెనీ అధికారిక వైఖరినే ప్రభుత్వం కూడా వినిపిస్తున్నది.
పరువు నష్టం నోటీసులు, కంపెనీ పద్ధతుల్లో వారు ఖండించుకోవలసింది కాస్త అధికారిక విధానంగా మారినట్టు అగుపిస్తున్నది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ, జనసేన తామే అసలైన భక్తి ప్రపత్తులు గలవారమని చాటుకోవడానికి ప్రయత్నిస్తూ అదే చర్చచుట్టూ రాష్ట్రాన్ని తిప్పుతున్నారు. వైసీపీ నేతలు వెంకన్న ఫొటోలతో సభకు రావడం దానిపై ప్రభుత్వపక్షం విరుచుకుపడటం ఇందులో భాగమే. తిరుపతికి పరిమితమైన ఈ వివాదం కాస్త ఇటీవల అన్ని క్షేత్రాలలోనూ ప్రసాదాలకు విస్తరింపచేస్తూ మతపరమైన ఆందోళన రెచ్చగొట్టడానికి తంటాలు పడుతున్నారు. అంతర్వేది, రామతీర్థం వంటి చోట్ల జరిగిన దురదృష్టకర ఘటనలతో ఎన్నికల ముందు ఈ శక్తులు చిచ్చు రాజేసేందుకు రాజకీయం నడిపాయని మర్చిపోలేము. అదే తొక్కిసలాట ఘటనలు మరణాల వంటివాటి తర్వాత కూడా పాలనాయంత్రాంగం పటిష్టత కోసం పెద్ద కేంద్రీకరించి లేదు.వారి నిజమైన లక్ష్యం ఏమిటో దీన్నిబట్టే తెలుస్తుంది.
అన్ని వేదికలపైనా..
ప్రత్యక్ష రాజకీయాలలోనే గాక కళాసాంస్కృతిక సామాజిక రంగాల్లోనూ ఈ మతతత్వ భావజాలం, తిరోగామి ధోరణలు ఇటీవల పెరుగుతున్నాయి. సినిమా రంగ ప్రముఖుడైన విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారు. పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక కూడా సినిమా రంగంలోనూ ఆ భావజాలం జొప్పించే దిశలో సాగుతున్నారు. నాగ్‌అశ్విన్ కల్కి, రాబోయే రాజమౌళి చిత్రం కూడా వారణాసి చుట్టూ తిరగడం యాదృచ్చికం కాదు. ఆ మాటకొస్తే మోడీ యోగి ఆదిత్యనాథ్‌లతో సహా కీలక నేతలంతా మోసిన కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు తీసిన నిర్మాత హైదరాబాదీ కావడం గమనించదగింది. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చి ఎన్టీఆర్ వంటివారిని కలసివెళితే, ఇప్పుడు స్వయంగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ పర్యటన సందర్భంలో తెలుగు సినిమా ప్రముఖులతో మంతనాలు జరిపివెళ్లారు.
చెన్నై కన్నా హైదరాబాదునే తమ తరహా సనాతన భావజాల చిత్రాలకు సరైన కేంద్రంగా పరివార్ భావిస్తున్నది. మీడియా సంస్థల్లో అధికభాగం బీజేపీతో ప్రత్యక్ష సంబంధం నెరుపుతున్నాయి. రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి ఈ మధ్యనే వచ్చివెళ్లారు. సినిమా వేడుకల్లోనూ, వేదికల్లోనూ మహిళలపైన ఇష్టానుసారం మాట్లాడటం, మతపరమైన సంకేతాలు వదలడం పరిపాటి అవతున్నది. ద్వితీయ శ్రేణి సినీ జీవులు కొందరు అచ్చంగా ఇదే విడియోల విడుదలలో వుంటున్నారు. ఇటీవలి కాలంలో పుస్తకాల ప్రచురణలోకీ ప్రవేశించారు. ఉదాహరణకు అయోధ్య చేరిన కృష్ణ వంటి పుస్తకాలు విస్తారంగా అమ్ముడవుతున్నాయని చెబుతున్నారుగాని అవి కూడా అటూ ఇటూ తిరిగి ఈ భావజాలం దిశలోనే వుంటున్నాయి.
మార్కెట్ హంగామా మతభావాలు రంగరించి అంగరంగ వైభోగంగా వేడుకలు జరపడం నిత్యకృత్యమైంది. ఇటీవలి కాలంలో ఈ తరహా ఛానళ్లు, సోషల్‌మీడియా, ప్రవచనాలు విస్తారంగా తీసుకొస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు కేంద్ర నేతలు వీటిలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రోద్బలమివ్వడం గమనించవచ్చు. మతపరమైన కోణాలు చాలక ఈ మధ్యన హిందూమతంలోనే శైవవైష్ణవ వివాదాలు కూడా ముందుకు తేవడానికి చినజియర్ స్వామి మాటలు కారణమైనాయి. నిజానికి మతతత్వంతో పాటు కుటతత్వాలు కూడా ప్రజ్వలింపచేసే పోకడలు పెరుగుతున్నాయి. ఏ కులాన్ని తాము ప్రధానంగా తీసుకోవాలనేదానిపైనా బీజేపీకి అంచనాలున్నాయి, విభజన రాజకీయాల అనివార్య పర్యవసానమిది.
తాజాగా అంబేద్కర్‌కు సంబంధించిన ఒక సంస్మరణ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ దళితుల పట్ల తమ పెద్దలు వ్యవహరించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని అనడం ప్రచారంలోకి వస్తున్నది. ఒకవైపున సనాతనం పేరిట వర్ణవ్యవస్థను కొనసాగిస్తూ మరోవైపున పశ్చాత్తాపం, ప్రాయశ్చితం వంటివి ప్రకటించడం దేశమంతటా పరివార్ అనుసరిస్తున్న వ్యూహంలో భాగమే. ఇదే రచయిత రాసిన బాహు బలిలో కట్టప్ప పాత్ర చూస్తే వర్ణవ్యవస్థపట్ల, వారిని బానిసలుగా ఉపయోగించుకోవడం పట్ల సనాతన దృష్టి కనిపిస్తుంది.1938లో మాలపిల్ల, 1939లో మళ్లీపెళ్లి, రైతుబిడ్డ వంటి చిత్రాలు అందించిన తెలుగు సినిమాకు సాంకేతిక జిలుగుల చాటున సామాజిక తిరోగమనం ఇది. ఈ తతంగం మొత్తం యువతను లక్ష్యంగా చేసుకుని సాగడం మరింత తీవ్రమైన విషయం.
ప్రాపకం కోసం పోటీలో ప్రమాదం
సినిమాల నుంచి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ, వైసీపీ జనసేనల మధ్య బీజేపీ పెద్దలు చాలా వ్యూహాత్మకంగా తమ పబ్బం గడుపుకొంటున్నారు. ఒకరిపైకి ఒకరిని ప్రయోగిస్తున్నారు. కూటమిటో మొదట పవన్ కళ్యాణ్‌ను తర్వాత లోకేశ్‌ను ఎక్కువగా చేరదీస్తున్నట్టు కనిపిస్తూ భిన్నసంకేతాలతో తికమక పెడుతున్నారు. మరోవైపున జగన్‌తోనూ సంబంధం వదులుకోబోమనే చెబుతున్నారు. బీఆర్‌ఎస్ అంతర్గత తగాదాలు, కుటుంబ వివాదాలు, కేసులు, విచారణల మధ్య కొందరిని తమవైపు తిప్పుకోవడం కోసం పొంచి చూస్తున్నారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాలు చూసే ఆరెస్సెస్ ప్రతినిధి సంతోష్ చాలా స్పష్టంగానే ఇటీవల ఆదేశాలు ఇచ్చివెళ్లినట్టు చెబుతున్నారు.
ఒకవైపున హిందూత్వంతో రెచ్చగొట్టడం, మరోవైపున దొరికిన అవకాశాలనూ, మనుషులనూ చేజిక్కించుకోవడం దేనికదే చేసుకుంటూ పోవాలన్నది పరివార్ వ్యూహంగా వుంది.తాత్కాలిక అవసరాలతో వారి ప్రాపకం కోసం పాకులాడుతున్న ప్రాంతీయ పార్టీలు, వ్యాపార మీడియా వర్గాలు దాని దీర్ఘకాలిక ప్రభావం పట్టించుకునే స్థితిలో లేకపోవడమే ఇక్కడ అనర్థకారణ మవుతున్నది. ఇతర పార్టీలను కబళించడం ద్వారా, మతవివాదాలు రగిలించడం ద్వారా తాము ఎదగాలనుకునే బీజేపీ తీరుతెన్నులు తెలిసికూడా వీరు ఆ వలలో చిక్కడం స్వయం కృతాపరాధమే. మరి తెలుగురాష్ట్రాలు దానికి చెల్లించవలసి వచ్చే మూల్యం ఎంతన్నది ప్రశ్న.
తెలకపల్లి రవి



