Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'పార్కింగ్‌' సవాల్‌

‘పార్కింగ్‌’ సవాల్‌

- Advertisement -

కార్పొరేషన్లు, పురపాలికల్లో నరకయాతన
పెరుగుతున్న వాహనాలు.. తగ్గుతున్న పార్కింగ్‌ స్థలం
అధికారుల చేతివాటం… హద్దుల్లేని అక్రమణలు
సెట్‌ బ్యాక్‌ లేక రోడ్లమీదే వాహనాలు
ప్రజలకు తప్పని ట్రాఫిక్‌ తిప్పలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు పార్కింగ్‌ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం, అంతులేని అవినీతి, దూరదృష్టిలేని ప్రణాళికలు, పర్యవేక్షణ కొరవడి ప్రజలకు పార్కింగ్‌ సంకటంగా మారింది. మహానగరాలకు, విస్తరిస్తున్న పట్టణాలకు ఇది పెద్ద సమస్యగా తయారవుతున్నది. రాష్ట్రంలోని 16 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 153 మున్సిపాల్టీలు వేగంగా విస్తరిస్తున్నాయి. వాటిని సకల వసతులతో ప్రణాళిక బద్ధంగా నిర్మించాల్సి ఉంటుంది.

పార్కులు, పార్కింగ్‌ స్థలాలు, డ్రైనేజీలు, విశాలమైన రోడ్లు, విద్యా, వైద్య సదుపాయాలు, సెట్‌బ్యాక్‌తో భవన నిర్మాణాల కోసం టౌన్‌ప్లానింగ్‌ రూపకల్పన చేస్తుంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త విధానాలు తెచ్చినా పార్కింగ్‌ వంటి కీలకమైన సమస్యను గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా నగరాలు, పట్టణాల్లో నివస్తున్న ప్రజలకు ఈ సమస్య నిత్యం నరకయాతనగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ వంటి స్మార్ట్‌ సిటిల్లో కూడా వాహనదారులకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. వాహనాలను నిలిపేందుకు ఉన్న స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడంలో రహదారులే పార్కింగ్‌ స్థలాలుగా మారుతున్నాయి.

వేగవంతమైన అనుమతులు సరే… అమలుపై పర్యవేక్షణ లేదు
బిల్డింగులు, అపార్టుమెంట్లు, ఆకాశహర్మాన్యాలకు వేగవంతమైన అనుమతులు ఇస్తున్నట్టు మున్సిపల్‌ శాఖ గొప్పగా చెబుకుంటున్నది. అందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టీజీ ఈపాస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్ట్‌ నౌ అనే కొత్త సాంకేతిక పద్దతులను తీసుకొచ్చింది. వాటి ద్వారా వేగవంతమైన అనుమతులు ఇస్తున్నప్పటికీ ఇక్కడ పార్కింగ్‌ కోసం స్థలాన్ని కేటాయిస్తున్నారా? ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎన్ని వాహనాలకు పార్కింగ్‌ ఉన్నదనే విషయంలో తీవ్రమైన పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నది. అనుమతులిచ్చామా? లేదా? అనేది లెక్క. ఆ తర్వాత అటువైపు కూడా తిరిగి చూడటం లేదు. అన్ని సక్రమంగా ఉంటేనే ఆక్యూఫై సర్టిఫికెట్స్‌ జారీ చేయాలి. కానీ చేయి తడిపితే చాలు అన్ని పనులు అయిపోతున్నాయి. ఆ తర్వాత తమకు ఏం సంబంధం లేదన్నట్టుగా అధికా రులు చేతులు దులుపేసుకుంటున్నారు.

పార్కింగ్‌ కోసం అనుమతులు… చేసేది వ్యాపార కార్యకలాపాలు
వాణిజ్య సముదాయాలు, అపార్టు మెంట్లు, వ్యక్తిగత నివాసాలు కావచ్చు… పార్కింగ్‌ కోసం అనుమతి తీసుకుని వాటికి వినియోగించకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మున్సిపల్‌ అధికారులు చేతి వాటం ప్రదర్శించడంతో పార్కింగ్‌ అతిక్రమ ణలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఒకవైపు విశ్వనగరం, మహా నగరం, స్మార్టు సిటీలు అని ఎన్ని చెబుకున్నా… పార్కింగ్‌ స్థలాలు లేకపోవడం తో మహా నగరాలు సైతం ట్రాఫిక్‌ రద్దీని ఎదుర్కొంటున్నాయి.

వాణిజ్య వ్యాపారాలు జరిగేచోట కూడా రోడ్ల మీదే వాహనాలను పార్కు చేస్తున్నారు. తమ వ్యాపారాలు నడుస్తు న్నాయా? లేదా? అనేదే కానీ వాహన దారుడు ఎవ రికీ పట్టడు. పైగా ఎవరి వస్తువులకు వారే బాధ్యులంటూ తోసేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల ఫోటోలు తీయడం, ఫైన్లు వేయడం, ముక్కు పిండి వసూలు చేయడం క్రమం తప్పకుండా చేస్తారు. కానీ రోడ్ల మీద వాహనాలు ఎందుకు నిలుపుతున్నారు. వ్యాపారులు వినియోగదారులకు పార్కింగ్‌ స్థలాన్ని ఎందుకు కల్పించడం లేదనే విషయాన్ని మర్చిపోతున్నారు.

చట్టాల ఉల్లంఘనలు… అధికారుల అవినీతి
చట్టాలను ఉల్లఘించడం, బిల్డర్లు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు అధికారులతో కుమ్మక్కై అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంతో ఈ పరిస్థితులు వస్తున్నాయి. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, గోడౌన్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్లినిక్‌లు, ఫుడ్‌ అవుట్‌లెట్లు, సర్వీస్‌ సెంటర్ల యాజమానులు ఇష్టానుసారం అక్రమనిర్మాణాలను చేపడు తున్నారు. ఫలితంగా దీర్ఘకాలికంగా పార్కింగ్‌ సంక్షోభానికి దారి తీసింది. ట్రాఫిక్‌ రద్దీ పెరిగిపోవడంతో సాధారణ ప్రయాణికులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది.

వీటి మూలంగా రోడ్‌ ప్రమాదాలకు గురిఅవుతున్నారు. ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు లేదా సేవా వాహనాలకు స్థలం అందుబాటులో ఉండటం లేదు. సామాన్య ప్రజలు ప్రక్కనే ఉన్న రోడ్లపై పార్కింగ్‌ చేయాల్సి వస్తుంది. తరచుగా వినియోగదారులు ట్రాఫిక్‌ జరిమానాలకు గురి కావాల్సి వస్తున్నది. అక్రమ భవనాలతోనే ఈ సమస్య తలెత్తుతున్నదనే విషయం స్పష్టంగా కనిపించినప్పటికీ, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిస్సహాయంగా వాహన యజమానులకు జరిమానా విధిస్తూనే ఉన్నారు.

పార్కింగ్‌ కష్టాలకు అక్రమ నిర్మాణాలే కారణం : ఎం.శ్రీనివాస్‌ యూడీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పార్కింగ్‌ కష్టాలకు అక్రమ నిర్మాణాలే కారణం, చేతివాటం ప్రదర్శిస్తూ… అడ్డగోలు అనుమతులు ఇవ్వడంతో సమస్య తీవ్రస్థాయికి చేరుతున్నది. భవనాల్లో కామన్‌ ఏరియాను కూడా రూమ్‌లు నిర్మిస్తున్నారు. పార్కింగ్‌ లేకుండా చేస్తున్నారు. వెంటనే అక్రమ కట్టడాలు కూల్చేయాలి.

సెల్లార్లను వాణిజ్య కార్యకాపాలకు వినియోగించరాదు : సీబీజీ అధ్యక్షులు శంకర్‌ ముదిరాజ్‌
పార్కింగ్‌ స్థలాలను చాలా చోట్ల వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. నిబంధలు ఉల్లఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే పార్కింగ్‌ కంప్లెక్స్‌లు నిర్మించాలి. వాహనాలు రోడ్ల మీద ఆపకుండా పార్కింగ్‌ స్థలాలు కేటాయించాలి.

ఉచిత పార్కింగ్‌ హామీ ఏమైంది : కె వీరయ్య, ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ సిటిజన్‌ ఫోరం
నగరాలు, పట్టణాల్లో ఉచిత పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. కొన్ని చోట్ల ఉచిత పార్కింగ్‌ అమలు అవుతున్నది. కానీ వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, బస్టాండ్లు ఇలా అనేక చోట్ల పెయిడ్‌ పార్కింగ్‌ పద్దతి నడుస్తున్నది. దీని ఫలితంగా చాలా మంది వాహనదారుల రోడ్ల మీద వాహనాలను నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ రద్దీ పెరిగి, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

రహదారులే పార్కింగ్‌ స్థలాలు
రాష్ట్రంలో ఏ నగరానికి, ఏ పట్టణానికి వెళ్లినా రోడ్ల మీదే వాహనాలను పార్కు చేస్తారు. ఇంటిలో స్థలం లేక రోడ్లే పార్కింగ్‌ స్థలాలుగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్య అన్ని నగరాలు, పట్టణాలను వేధిస్తున్నది. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోటళ్లు, షాపింగ్‌ మహాళ్లు కనిపిస్తాయి. వీటి ముందు కూడా పార్కింగ్‌ స్థలాలు ఉండవు. రహదారులపై పార్కు చేయాల్సిందే. దీంతో ట్రాఫిక్‌ జామై ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -