జన విశ్వాస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర సాయుధ దళాల అధిపతులుగా ఐపీఎస్ అధికారులను నియమించేందుకు ఉద్దేశించిన సీఏపీఎఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సాయుధ దళాల అధిపతి పదోన్నతికి సీనియర్ సీఏపీఎఫ్ అధికారులను పరిగణనలోకి తీసుకోవాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అధిగమించేందుకు ప్రవేశపెట్టిన ఈ వివాదాస్పద బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించగా, గురువారం లోక్‌సభ కూడా మూజువాణి ఓటుతో ఆమోదం తెలపడంతో పార్లమెంటరీ ఆమోదం లభించింది.
23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాల నిబంధనలను సవరించే జన విశ్వాస్ బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. చిన్న చిన్న నేరాలకు శిక్ష నుంచి మినహాయింపునిచ్చే ఈ బిల్లు, పరిశ్రమలు, వాణిజ్య రంగానికి సహాయ పడుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ బిల్లు అవినీతిని వ్యవస్థీకృతం చేస్తుందని ప్రతిపక్షాలు చర్చలో విమర్శించాయి. ఈ కొత్త చట్టం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి ఎంతో సహాయకరంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీవ్ర నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభలో ఈ బిల్లు హడావిడిగా ఆమోదం పొందింది.
లోక్‌సభలో సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మర్యాదగా, సభ్యతగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. సభా కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు మంత్రులు, సభ్యులు ఎక్కువసేపు మాట్లాడుకోవడం సరైన పద్ధతి కాదని స్పీకర్ సూచించారు. సభా కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు కొందరు సభ్యులు, మంత్రులు సుదీర్ఘ సంభాషణలలో నిమగమవ్వడాన్ని గమనించిన తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా స్పీకర్ హెచ్చరించారు. గురువారం పార్లమెంట్ వాయిదా పడినప్పటికీ, ‘ముఖ్యమైన బిల్లులను’ పరిశీలించడానికి త్వరలోనే తిరిగి సమావేశమవుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలపై త్వరగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. ఈ విషయం ప్రతిపక్షానికి కూడా తెలియజేశామని మంత్రి తెలిపారు.
శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పటికీ, దానిని ఎలా అమలు చేస్తుందనే విషయంపై ప్రతిపక్షానికి సమాచారం ఇవ్వకుండా చీకట్లో ఉంచుతోందని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ప్రతిపాదిత బిల్లులు సుదూర పరిణామాలను కలిగి ఉంటాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందే లోక్‌సభ సీట్ల సంఖ్యను 816కు, మహిళల ప్రాతినిధ్యాన్ని 273 సీట్లకు పెంచే రాజ్యాంగ సవరణలను ప్రభుత్వం త్వరగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీని తరువాత, ఉభయ సభలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన మొదలైన వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణలను పరిశీలించడానికి పార్లమెంట్ ఈ నెల 16వ తేదీన తిరిగి సమావేశమవుతుంది.
సీఏపీఎఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
- Advertisement -
- Advertisement -


