ఏప్రిల్ 16 తరువాత మళ్లీ నిర్వహణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు వంటి ముఖ్యమైన చట్టాలను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను పొడిగించింది. గురువారం బడ్జెట్ సమావేశాల రెండో దశ ముగిసిన తరువాత పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడుతుందని భావించారు. అయితే, సభా కార్యకలాపాలు ముగిసిన తరువాత ఈ నెల 16న ఉదయం 11 గంటల వరకు సభ వాయిదా పడుతుందని అధికారిక ప్రకటన వెలువడింది. లోక్‌సభ, శాసనసభలలో సీట్లను పెంచేందుకు, మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశిం చిన రాజ్యాంగ సవరణ బిల్లులను వేగంగా ఆమోదిం చేందుకే బడ్జెట్ సమావేశాలను పొడిగిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం చెబుతోంది.
అదే సమయంలో, మైనారిటీల హక్కులు ఉల్లంఘించే ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు కూడా వాటిలో ఆమోదం పొందుతుందనే బలమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అయితే, పార్లమెంట్ లోపల, వెలుపల భారీ నిరసనలు వెల్లువెత్తాయి. కేరళ ఎన్నికల ముందు ఈ బిల్లు ఆమోదం పొందితే బిజెపీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. దీని తరువాత, బిల్లును తక్షణమే ఆమోదించాలన్న తన నిర్ణయం నుంచి ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన అపార్థాలు సృష్టిస్తున్నాయని, ఎన్నికల తరువాత బిల్లును ఆమోదించాల్సిన పరిస్థితి వస్తుందని బీజేపీ వాదిస్తోంది.
కేరళలో ఎన్నికల తరువాత పార్లమెంట్ తిరిగి సమావేశమవుతుంది. ఈ పరిస్థితుల్లో, ప్రత్యేక సమావేశంలో ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును కూడా ఆమోదిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణలను ఎలా అమలు చేయాలన్న ప్రతిపక్షాల ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇంకా సమాధానం ఇవ్వలేదు. రాజ్యాంగ సవరణను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాల మద్దతు కూడా అవసరం. అయితే, అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి గానీ, ప్రతిపక్షాల సందేహాలకు వివరణ ఇవ్వడానికి గానీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానం వ్యక్తమవుతోంది.
పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు
- Advertisement -
- Advertisement -



