Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఐదో రోజూ స్తంభించిన పార్లమెంట్‌

ఐదో రోజూ స్తంభించిన పార్లమెంట్‌

- Advertisement -

ఉభయ సభలు సోమవారానికి వాయిదా
ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు కేంద్రం సుముఖం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంట్‌ ఉభయ సభలు ఐదో రోజూ కూడా ప్రతిపక్షాల ఆందోళనతో స్తంభించాయి. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో హౌరెత్తించారు. 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై మోడీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ఉద్దేశపూర్వకంగా జరుపుతున్న దాడి అని విమర్శలు గుప్పించారు. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్‌సభలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు.

వాయిదా తీర్మానాలపై చర్చకు ఎంపీలు పట్టుబట్టారు. ముఖ్యంగా బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలతో హౌరెత్తించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనతో ప్రారంభమైన నిమిషాల్లోనే సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఎలాంటి చర్చా లేకుండానే మధ్యాహ్నం 2 గంటల వరకూ సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది.

ఆపరేషన్‌ సిందూర్‌, పహల్గాం ఉగ్రదాడిపై చర్చ
ఆపరేషన్‌ సిందూర్‌, పహల్గాం ఉగ్రదాడి ఘటనలపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ రెండు అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడం, వరుసగా పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌ అంశంపై సోమవారం (జులై 28న) చర్చ జరుగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చను ప్రారంభిస్తారు. ఈ చర్చలో హౌం మంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు బీజేపీ ఎంపీలు అనురాగ్‌ ఠాకూర్‌, నిషికాంత్‌ దూబే పాల్గొంటారు. ప్రధాని మోడీ సైతం చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.

రాహుల్‌ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా చర్చలో ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. 29న రాజ్యసభలో ఈ అంశంపై చర్చ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జైశంకర్‌తో పాటు ఇతర మంత్రులు పాల్గొంటారు. రాజ్యసభలో జరిగే చర్చలోనూ ప్రధాని మోడీ పాల్గొనే అవకాశం ఉంది. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం, దేశ విదేశాంగ విధానంలో అమెరికా జోక్యంపై ప్రశ్నలు లేవనెత్తనున్నారు.

బీఏసీ సమావేశంలో అర్థవంతమైన చర్చకు సహకరించండి: స్పీకర్‌
సభలో నిరసనలకు బ్రేక్‌ వేసేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా శుక్రవారం బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సహకరించాలని ప్రతిపక్ష నాయకులను స్పీకర్‌ కోరినట్టు తెలిసింది. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష ఎంపీలు చెప్పినట్టు సమాచారం. సోమవారం నుంచి లోక్‌సభ కార్యకలాపాలూ సజావుగా సాగనున్నాయని సమాచారం. అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు కాంగ్రెస్‌ సహా అనేక ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్‌ సిందూర్‌, పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్‌ చేశాయని అన్నారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. తొలిరోజు నుంచి పార్లమెంట్‌లో ప్రతిపక్షం గందరగోళం సృష్టిస్తోందని, పార్లమెంట్‌ లోపల, వెలుపల నిరసన తెలుపుతోందని ఆరోపించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలివారంలో ఏమీ జరగలేదని, పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంతరాయం కలిగించొద్దని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నామన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, పహల్గాం ఉగ్రదాడిపై ఉభయసభల్లో 16 గంటల చొప్పున మొత్తం 32 గంటల పాటు చర్చ ఉంటుందని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad