Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్‌ ఈ-మెయిల్‌ వ్యవస్థ ప్రయివేటుపరం

పార్లమెంట్‌ ఈ-మెయిల్‌ వ్యవస్థ ప్రయివేటుపరం

- Advertisement -

బ్యాకెండ్‌ నిర్వహణ ఔట్‌సోర్స్‌కు అప్పగింత
‘విశ్వసనీయత’కు సమాధి కట్టడమే సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ ఆందోళన
రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ

న్యూఢిల్లీ : దేశ శాసన వ్యవస్థలో విశ్వసనీయత, సమాచార గోప్యతకు రాజ్యాంగ నిర్మాతలు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ప్రజలకు అవసరమైన మేరకు మినహా తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని గోప్యతగా ఉంచుతానని ప్రజాప్రతినిధులు ప్రమాణం కూడా చేస్తారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు శాసన వ్యవస్థ గోప్యతకే గంపగుత్తగా తిలోధకాలు ఇచ్చేసింది. పార్లమెంటకు సంబంధించిన ఇ-మెయిల్‌ వ్యవస్థను ప్రయివేటుపరం చేయాలని నిర్ణయించింది. ఈ-మెయిల్‌ బ్యాకెండ్‌ కార్యాకలాపాల నిర్వహణను ఔట్‌ సోర్సింగ్‌ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సీపీఐ(ఎం) నేత, రాజ్యసభ సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌ ఇదే ఆందోళన వ్యక్తం చేస్తూ రాజ్యసభ చైర్మెన్‌ సిపి రాధాకృష్ణన్‌కు ఒక లేఖ రాశారు. ఆ లేఖను సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన ప్రజల ముందుంచారు. పార్లమెంటరీ ఇ-మెయిల్‌ వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలను ఒక ప్రయివేటు కంపెనీకి ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రయివేటు సంస్థకు అప్పగిస్తే.. పార్లమెంట్‌ సభ్యులు తమ అధికారిక ఈ మెయిల్‌ ఖాతాల నుంచి పంపే కమ్యూనికేషన్ల గోప్యత, విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని బ్రిట్టాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శాసన వ్యవస్థ స్వయంప్రతిపత్తిని, పార్లమెంటరీ సార్వభౌమాధికార పునాదులను ఇలాంటి చర్యలు దెబ్బతీస్తాయని తెలిపారు. పార్లమెంటరీ కమ్యూనికేషన్లను ఇప్పటివరకు పూర్తిగా నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)నే చూస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ ఇ-మెయిల్‌ వ్యవస్థ బ్యాకెండ్‌ ఆపరేషన్ల బాధ్యతలను జోమో కార్పొరేషన్‌ అనే ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించారని బ్రిట్టాస్‌ తన లేఖలో పేర్కొన్నారు. దాదాపు 50లక్షల ప్రభుత్వ ఇ మెయిల్‌ ఇన్‌బాక్సులను ఇక ఈ ప్రయివేటు సంస్థ నిర్వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలియవచ్చిందని బ్రిట్టాస్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.
”పార్లమెంట్‌ సభ్యుల అధికారిక సంసద్‌ ఇ మెయిల్‌ వ్యవస్థను కొత్త ఫ్రేమ్‌వర్క్‌ కిందకు తీసుకువచ్చారు. ఇకపై జోహో నిర్వహించే కొత్త వెబ్‌సైట్‌ అడ్రస్‌ను, అలాగే బహుళ అంశాల ప్రామాణీకరణ కోసం జోహో అభివృద్ధిపరిచిన ‘వన్‌ఆథ్‌’ అప్లికేషన్‌ను పార్లమెంట్‌ సభ్యులు ఉపయోగించాలని ఎన్‌ఐసీ ఆదేశించింది.”

పార్లమెంట్‌ సభ్యులు నిర్వహించే అన్ని రకాలైన అధికారిక లావాదేవీలు వారి ఈ-మెయిల్‌ ఖాతాల్లో వుంటాయి. అలాగే సున్నితమైన డాక్యుమెంట్లను కూడా వారు పంచుకుంటారు. ముసాయిదా బిల్లులను పంపిస్తారు. రాజ్యాంగ అధికారులతో మాట్లాడిన విషయాలు వుంటాయని బ్రిట్టాస్‌ చెప్పారు. ”ఇటువంటి కమ్యూనికేషన్లు ప్రయివేటు వ్యక్తుల నియంత్రణలో వుండే బేక్‌ ఎండ్‌ ఆపరేషన్ల ద్వారా, అలాగే ప్రైవేటు సంస్థ నిర్వహించే ఒక ప్రామాణీక వ్యవస్థ ద్వారా వెళ్ళడం వల్ల చట్టసభ స్వాతంత్య్రం ప్రమాదంలో పడే ముప్పు పొంచి వుంది.”అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆధునీకరణ, మార్పు జరగాల్సిన స్థాయి (స్కేలబిలిటీ), సైబర్‌ భద్రత వంటి కారణాలను చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్ధించుకోవడానికి చూస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ”కానీ, అంతకన్నా పెద్ద ప్రశ్న ఒకదానికి సమాధానం లభించలేదు-వ్యవస్థాగత స్వాతంత్య్రాన్ని దెబ్బతీయకుండా పార్లమెంట్‌తో సహా ప్రభుత్వ కమ్యూనికేషన్‌ వ్యవస్థల సంరక్షణ బాధ్యతలను ఒక ప్రయివేటు సంస్థ ద్వారా నిర్వహించవచ్చా? ఎన్‌ఐసీ లేదా ఇందుకు సంబంధించిన మరే ఇతర ప్రభుత్వ సంస్థల అవసరాలకు అనుగుణంగా నిపుణులను, మౌలిక సౌకర్యాలను పెంచడంలో ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నది ఏమిటి?” అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -