Thursday, February 5, 2026
E-PAPER
Homeమానవిపేర‌డీ రాణి జాన‌ప‌ద కోకిల‌

పేర‌డీ రాణి జాన‌ప‌ద కోకిల‌

- Advertisement -

అల్లూరి అరుణ… తండ్రిని మించిన తనయగా ఎదిగి భర్త ప్రోత్సాహంతో 18వేలకు పైగా ప్రోగ్రాములివ్వటం ఒక రికార్డు. తన గళాన్ని గిరికీలు కొట్టిస్తూ శ్రోతలని నవ్వుల్తో ముంచెత్తటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పాటంటే మాటకాదు, సాధన కృషి ఉండాలి. పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఐదేండ్ల పాపగా తండ్రి శిక్షణలో రాటుతేలింది ఆమెగానం. ఆపై జానపద సంగీతంలో డాక్టరేట్‌ తీసుకోటం వెనుక ఆమె కృషి పట్టుదల ఉన్నాయి. 14 దేశాల్లో గానామృతాన్ని పంచి విశ్వవ్యాప్తం చేశారు. పెళ్లి పాటలు ఇంకా మన తెలుగు సంస్కృతి సంప్రదాయ పాటల్ని నేర్పుతూ యువతకి శిక్షణ ఇస్తున్నారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా, మ్యూజిక్‌ కంపోజర్‌గా, బుర్రకథ కళాకారిణిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఫోక్‌ మ్యూజిక్‌లో ఎ గ్రేడ్‌ ఆర్టిస్టుగా, డ్రామాలో బి గ్రేడ్‌ కళాకారిణిగా ఆకాశవాణితో పాటు వివిధ టి.వి.ఛానెల్స్‌లో రాణిస్తూ బహుముఖ కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

అరుణ విజయనగరంలోని భోగాపురంలో పుట్టారు. తండ్రి రఘునాధరాజు సెక్యూరిటీ ఆఫీసర్‌, కవి, గాయకుడు. తన ముగ్గురు పిల్లల్ని కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. పెద్ద కూతురు అరుణ బాల్యం నుంచే తర్ఫీదు పొందింది. ఐదేండ్ల చిన్నారిగా బడిలో పాటల పోటీలో ఫస్ట్‌ ప్రైజ్‌గా పలకాబలపం పొందటంతో ఆమె జైత్రయాత్ర ప్రారంభమైంది. నేటికి వెయ్యి బుర్రకథలను తమ్ముడు చెల్లితో కలిసి చెప్పారామె. పిల్లలతో బిజీగా ఉండి ఎనిమిదేండ్లు పాటకు దూరమైన ఆమె సీనియర్‌ ఎన్‌.టి.ఆర్‌. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మహిళా వాయిద్య కళాకారులతో…
సంగారెడ్డి అమ్మాయిల పాఠశాలలో చదివేటప్పుడు జిల్లాస్థాయి పోటీల్లో ఫస్ట్‌ ప్రైజ్‌ని నాటిమంత్రి హరిగ్రీవాచారి చేతుల మీదుగా అందుకున్నారు. పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ ఆమెను రాంకోఠి మ్యూజిక్‌ కాలేజీలో చేర్చటంతో బంగారానికి తావి అబ్బింది. రేవంత్‌ రేవతీరత్న స్వామి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఒక సీరియల్‌లో అమ్మ వారి పాత్ర వేశారు. దాదాపు అన్ని టి.వి.ఛానెల్స్‌ లో ఆమె వివిధ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్నారు. డిడి టెలిస్కూల్‌ మొదలు కేవలం మహిళా వాయిద్య కళాకారులతో ప్రోగ్రామ్‌లు చేయటం ఓ రికార్డు.

కొత్త వారికి చేయూతనిస్తూ…
ప్రస్తుతం అనేక టీవీ ఛానెల్స్‌లో జడ్జిగా, కో ఆర్డినేటర్‌గా, రైటర్‌గా, యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనతో పాటు కొత్త వారికి చేయూతనిస్తూ జానపదగేయాలు, బుర్ర కథలకు ఊపిరిపోయటం హర్షణీయం. అరుణ జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలతో తెలుగుపాటకి వెలుగునిస్తూ పేరడీ పాటలతో గారడీ చేస్తూ శ్రోతలని నవ్విస్తూ కొత్త సొబగులు చేకూరుస్తున్నారు. 100 నిముషాల్లో 100పాటలు 12 భాషల్లో పాడి రికార్డు నెలకొల్పిన ఘనత ఆమెది. ఘంటసాల దాసరి అవార్డులు, ఢిల్లీ అకాడమీవారి శిరోమణి అవార్డు ఇంకా ఎన్నెన్నో అందుకున్నారు.

ఆర్ట్స్‌ అకాడమీ ద్వారా…
పేరడీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న అరుణ సాంప్రదాయ గాన శిరోమణి, సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు మెంబర్‌గానూ కొనసాగుతున్నారు. కల్చరల్‌ డిపార్టుమెంట్‌ తరుఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బతుకమ్మ ఉత్సవాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాలలో పాల్గొంటున్నారు. అరుణ ఆర్ట్స్‌ అకాడమీ ద్వారా మహిళలకు చేయూత నివ్వాలని ఆమె సంకల్పం. 1995లో ఆలాపన అనే సంస్థను స్థాపించి ప్రతిఏటా సంగీతం పోటీలను నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగా, ఓ గొప్ప కళాకారిణిగా ఇది ఆమె సాధించిన వ్యక్తిగత విజయం. 1976 నుండి ఇప్పటివరకు దాదాపు 18 వేల ప్రోగ్రాములు, 12 దేశాలు, ఎన్నో రాష్ట్రాలు.. ఆకాశవాణిలో ఏ గ్రేట్‌ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. 100 నిమిషాల్లో 100 జానపదాలు, 108 నిమిషాల్లో 108 జానపదాలు, వివిధ యాసలు 12 భాషల్లో లిమ్కా, తెలంగాణ, వండర్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వంటి ఎన్నో అందుకున్నారు.

ఎన్నో అవార్డులు, రివార్డులు
శాస్త్రీయ సంగీతంలో డిప్లమా పొందిన అరుణ జానపద, లలిత, సినీ గీతాల సింగర్‌గా, రైటర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, ఈవెంట్‌ మేనేజర్‌గా, కాన్సెప్ట్‌ డిజైనర్‌గా, అన్ని ఛానల్స్‌లో గెస్ట్‌గా, జడ్జ్‌గా, హోస్ట్‌గా తన ప్రతిభను చాటు కుంటున్నారు. తన 30 ఏండ్ల కృషికి డాక్టరేట్‌ సైతం పొందారు. రాష్ట్రం తరపు నుంచి కీర్తి పురస్కారం ఉగాది పురస్కారం, అంతర్జాతీయ స్థాయిలో శిరోమణి అవార్డులు అందుకున్నారు. జానపదాల్లో బతుకమ్మ, బోనాలు, సాంప్రదాయ, పెళ్లి పాటలు, పల్లె పాటలతో పాటు అన్ని పండగల పాటలు పాడుతూ బహుముఖ కళాకారుణిగా ఉన్నారు. పేరడీతో పాటు స్టాండప్‌ కామెడీ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -