– ఆయన ఆశయాలతో ముందుకు సాగుదాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికోద్యమానికి ఎనలేని కృషి చేసిన పర్సా సత్యనారాయణ జీవితం ఆదర్శనీయమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్మరించుకున్నారు. పర్సా వర్థంతిని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పాలడుగు భాస్కర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, కార్యదర్శులు జె.వెంకటేష్, పుప్పాల శ్రీకాంత్, కూరపాటి రమేష్, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సుధాకర్, వై. సోమన్న, ఎ. సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికునిగా పర్సా జీవితం ప్రారంభించారనీ, యూనియన్ ఏర్పాటు కోసం కషి చేస్తున్న సమయంలో యాజమాన్యం ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించిందని గుర్తుచేశారు.
ఆ తర్వాత ఆయన పూర్తికాలం కార్మిక ఉద్యమానికి అంకితమై వివిధ బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. కార్మికలోకం మాసపత్రికను తీసుకురావడంలో కీలకపాత్ర పోషించే వారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రజాసేవ చేస్తూనే కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఎస్. వీరయ్య మాట్లాడుతూ రాజకీయ అంశాలపై పర్సాకు అపారమైన పట్టు ఉండేదనీ, కార్మికలోకం, ప్రజాశక్తి పత్రికల్లో అనేక వ్యాసాలు రాసేవారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలిచిన పర్సా సత్యనారాయణ ఆశయాల సాధనకు పునరంకితం కావడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు.
పర్సా జీవితం ఆదర్శనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES