– ఆస్ట్రేలియాలో ‘ఇండియన్’ సీఈవోలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘తెలంగాణ రైజింగ్’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ఇండియన్ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. విరివిగా పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోవాలని కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా శనివారం సిడ్నీలో ‘ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ కాంక్లేవ్‌లో వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ”తెలంగాణ” ముందు వరుసలో ఉందని అన్నారు. తక్కువ సమయంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన పాలన కారణంగా అంతర్జాతీయ పెట్టుబడులకు రాష్ట్రం సురక్షితమైన గమ్యస్థానంగా మారిందని తెలిపారు. తెలంగాణలో పారిశ్రామి కాభివృద్ధికి అనుకూలించే అంశాలు, పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాలు, ఎకో సిస్టం, సింగిల్ విండో అనుమతుల వ్యవస్థ తదితర అంశాలపై ఈ సందర్భంగా మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ‘ఇండిస్టీ రెడీ వర్క్ ఫోర్స్’ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న చొరవను వివరించారు. ఏఐ, డేటా అనలిటిక్స్, మెషిన్‌లెర్నింగ్, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఈవీల తయారీ తదితర రంగాల్లో తెలంగాణ లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ‘ది సెంటర్ ఫర్ ‘ఆస్ట్రేలియా- ఇండియా రిలేషన్స్’ చైర్‌పర్సన్ స్వాతిదవే, బిజినెస్ కౌన్సిల్ నేషనల్ అసోసియేట్ చైర్మెన్ ఇర్ఫాన్ మాలిక్, ఈటీపీఎల్ డైరెక్టర్ సౌరవ్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం కండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



