Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌వాడీ సేవల్లో మహిళా సంఘాలకు భాగస్వామ్యం

అంగన్‌వాడీ సేవల్లో మహిళా సంఘాలకు భాగస్వామ్యం

- Advertisement -

– ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలకూ అవకాశం
– త్వరలో సరికొత్త బాలామృతం : మహిళా శిశుసంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అంగన్‌వాడీ సేవల్లో మహిళా సంఘాల గ్రూపులకు భాగస్వామ్యం కల్పించే అవకాశాన్నీ, సేవకు ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) ఆదేశించారు. త్వరలో సరికొత్త బాలామృతం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చాలని ఆదేశించారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుని నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలని సూచించారు. అవసరమున్న చోట మొబైల్‌, కంటైనర్‌ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు.

వెంటనే నిపుణులతో చర్చించి డిజైన్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. చిన్నారుల్లో పోషకాహర లోపాన్ని తగ్గించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో పోషకాహార మెరుగుదలను పరిశీలించేందుకు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పోషకాహార లోపాన్ని పారదోలేందుకు పిల్లలకు అందించే ఆహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వంద రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సుప్రీం కోర్టు కేసు నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలనీ, కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

నిపుణుల సిఫారసు మేరకు పంచదార లేకుండా సరికొత్త బాలామృతాన్ని టీజీ ఫుడ్స్‌ సిద్ధం చేయగా మంత్రి సీతక్క రుచి చూసి పలు సూచనలు చేశారు. పిల్లలకు తీపి అనుభూతి కలిగించేలా ఖర్జూరా పౌడర్‌ను మిక్స్‌ చేయాలని సూచించారు. అల్పాహారం కోసం కిచిడీ, ఉప్మా మిక్స్‌లను సిద్ధం చేశారనీ, వేడి నీటిలో వేసి మరిగించగానే అల్పాహారం సిద్ధమవుతుందని చెప్పారు. సమీక్షలో ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌, ఆ శాఖ డైరెక్టర్‌ సృజన, తెలంగాణ ఫుడ్స్‌ ఎమ్‌డీ కే. చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా రూ.కోటి ఆదాయం
ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు కోటి రూపాయలను అర్జించాయి. ఇప్పటి వరకు 150 బస్సులను ఆర్టీసీకి మహిళా సంఘాలు అద్దె ప్రాతిపదికన అప్పగించాయి. ఒక్కో బస్సుకు ఆర్టీసీ నెలకు రూ.70 వేలు చెల్లిస్తోంది. ఈ లెక్కన ఒక్కో నెలకు మహిళా సంఘాలు రూ. కోటి అందుకోనున్నాయి. దీనికి సంబంధించి మొదటి నెల పేమెంట్‌ను ఆర్టీసీ మహిళా సంఘాలకు చెల్లించింది. ఈ చెక్కును ఆర్టీసీ యాజమాన్యం నుంచి సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా దివ్య దేవరాజన్‌, సెర్ప్‌సిబ్బందికి మంత్రి సీతక్క మిఠాయిలు తినిపించారు. సెర్ప్‌ సీఈఓను, మహిళా సంఘాలను మంత్రి అభినందించారు. నెలకు రూ. కోటి ఆదాయాన్ని అర్జించేలా సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్‌ చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 5న ప్రజా భవన్‌లో ఆర్టీసీ బస్సు ఓనర్లుగా ఉన్న మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -