సర్వోదయ తెలంగాణ లక్ష్యం
ఢిల్లీలో లాబీయింగ్ తెలుసు.. గల్లీల్లో పనిచేయడమూ వచ్చు
ఎవరికీ బీ టీమ్‌గా ఉండం.. నెంబర్‌వన్ పార్టీగా మారుస్తా
మాతోనే బీఆర్‌ఎస్ క్యాడర్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయప్రతినిధి
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘క్రిటిసిజం’, అధికారంలోకి వచ్చాక ‘ఎస్కెపిజం’ అలవాటుగా మారింది. దీన్ని మార్చేందుకు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అవసరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 ఏండ్లయినా ప్రగతిని చూస్తే.. నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేని దుస్థితి. రైతులు మొదలు అన్నివర్గాల ప్రజలు రాష్ట్రంలో ఇక్కట్లు పడుతున్నారు, వారికి కొత్త రాజకీయ శక్తి కావాలి. సర్వోదయ తెలంగాణ కోసం కృషిచేస్తా.
ఈ క్రమంలో ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రాజకీయ పార్టీ పేరుతోపాటు జెండా, ఎజెండాను ప్రకటిస్తా’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్‌లో (ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-6) జాగృతి కార్యకర్తలతో కలిసి పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ బిడ్డనైన తాను.. నిజామాబాద్ కోడలి నని, ఇంటి పని ముందు చేసుకోవాలని అందుకే జిల్లా ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
తెలంగాణ భవిష్యత్తును మారుద్దాం
తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మారనున్నట్టు కవిత తెలిపారు. ప్రాంతీయ పార్టీ గా, ప్రతి ఇంటి పార్టీగా ఉంటుందని అన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయగానే ఎవరికీ బీ టీమ్ అంటూ విమర్శలు చేసే సంస్కృతి ఉండటం బాధాకరమని చెప్పారు. తమ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని.. తమదే తెలంగాణలో నంబర్‌వన్ పార్టీ అవుతుందన్నారు. కుల,మత, వర్గాలకు అతీతంగా సర్వ జను ల కోసం పనిచేస్తామని చెప్పారు. తమ ఎజెండా ప్రాక్టికల్‌గా, ప్రజల ఆమోదం పొందేవిధంగా ఉంటుందన్నారు. ఇప్పటికే 50 కమిటీలు వేయటంతో పాటు మేధావులతోనూ చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ భవిష్యత్తును మార్చేందుకు కంకణం కట్టుకున్నామన్నారు.
ఎస్సీల సంక్షేమానికి నిధుల్లో కోత పెట్టినా.. మక్కలు కొనుగోలు చేయకున్నా, ఇచ్చిన హామీలు అమలు చేయకున్నా ఎవరూ అడగడం లేదని రాజకీయ నాయకులు అనుకుంటున్నారని.. అందుకే ప్రజలను చైతన్యవంతం చేస్తామని, ఫలితం వచ్చేవరకూ ప్రశ్నించడం నేర్పిస్తామన్నారు. నిజామాబాద్-పెద్దపల్లి రైల్వే లైన్ 25 ఏండ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఆ సమయంలో దాన్ని పూర్తి చేసుకునే బాధ్యత తీసుకుంటే అందరూ ఎగతాళి చేశారని.. కానీ మూడున్నరేండ్లలో ఆ పనిని పూర్తి చేయించినట్టు తెలిపారు. తాను ఏదైనా పని పట్టుకుంటే ఫలితం వచ్చే వరకూ వదిలి పెట్టనని అన్నారు. తనకు ఢిల్లీలో లాబీయింగ్ తెలుసు అని, గల్లీల్లో పనులు చేయడమూ తెలుసని తెలిపారు.
సలహాలు.. సూచనలివ్వండి
తెలంగాణ ప్రజలు కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే తమ పార్టీ ఏ విధంగా పనిచేయాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కవిత కోరారు. తమ ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదనే ఉంటుందని.. రాజకీయ పార్టీకి ఈగో ఉండకూదన్నారు. గతంలో తనను విమర్శించిన వారైనా సరే తెలంగాణ కోసం పనిచేసే ఉద్దేశం ఉంటే కలిసి రావాలని పిలుపునిచ్చారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముని స్ఫూర్తితో పార్టీ ప్రకటన చేస్తున్నానని అన్నారు. పాలనపై ప్రజాభిప్రాయం తీసుకుని వైఫల్యాలను మార్చుకున్న వ్యక్తి శ్రీరామ చంద్రుడని గుర్తు చేశారు.
శ్రీరామ నవమి రోజు చేసిన పార్టీ ప్రకటన నుంచి పార్టీ ఆవిర్భావం నాటికి ఇంకా 28 రోజులు ఉన్నాయన్నారు. ఈ 28 రోజుల్లో అభ్యుదయ, సామాజిక తెలంగాణ కోసం మేధావులతో చర్చిస్తామన్నారు. పార్టీ ఏయే అంశాల మీద పని చేయాలో తమకు తెలియజేయాలని ప్రజలను సైతం కోరుతున్నామని, వాట్సాప్ నెంబర్, ఈ మెయిల్ వివరాలు అందజేస్తామని తెలిపారు. పార్టీ ఆవిర్బావ సభకు ప్రతి ఒక్కరూ విచ్చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించే సరికి అక్కడ, ఇక్కడ ప్రభావం తగ్గిందని.. తమ పార్టీ ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్ క్యాడర్ తమతోనే ఉన్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.



