No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంబీసీ బిల్లు ఆమోదించండి

బీసీ బిల్లు ఆమోదించండి

- Advertisement -

అమిత్‌షాకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ విజ్ఞప్తి
పరిశీలిస్తాం : అమిత్‌షా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఢిల్లీలో జరుగుతున్న స్పీకర్ల సదస్సులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రారంభోపన్యాసం తర్వాత తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌..కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉందని స్పీకర్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంపై ప్రత్యేకంగా మిమ్ముల్ని కలిశారని గుర్తు చేశారు. ఆ బిల్లు విషయం చూస్తానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌తో అమిత్‌ షా అన్నట్టు సమాచారం

దేశ ప్రజల సమస్యల పరిష్కారానికి నిష్పాక్షిక వేదిక కావాలి : అఖిల భారత స్పీకర్ల సమావేశంలో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా
దేశ ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పాక్షికమైన వేదిక కావాలని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా అన్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర శాసనసభ మొదటి స్పీకర్‌గా విఠల్‌భారు పటేల్‌ ఎన్నికై శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజుల పాటు నిర్వహించే అఖిల భారత స్పీకర్ల సమావేశాన్ని ఆదివారం కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా హౌంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ దేశ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, స్వాతంత్య్రం తరువాత దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. భారతీయ ఆలోచనల ఆధారంగా దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడానికి పునాది వేసే పని విఠల్‌భారు పటేల్‌ చేశారని ఆయన అన్నారు. సభ గౌరవాన్ని, స్పీకర్‌ పదవి గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశ ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పాక్షికమైన వేదికను అందించాలని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం సభ సక్రమంగా జరిగేలా చూసుకోవడం ప్రతి సభ్యుని బాధ్యతని పేర్కొన్నారు.

సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాలు నిష్పాక్షిక వాదన చేయాలని అన్నారు. ‘స్వర్ణ చరిత్రను సృష్టించిన, స్వర్ణ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మొత్తం శాసన వ్యవస్థ ఈ చారిత్రాత్మక సభలో ఉంది’ అని అమిత్‌ షా అన్నారు. దేశ సుధీర్ఘ చరిత్రలో అసెంబ్లీలు తమ గౌరవాన్ని కోల్పోయినప్పుడల్లా, మనం భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ ఈ స్పీకర్ల సమావేశం ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, అసెంబ్లీలు కేంద్ర బిందువులని, రెండూ సరిగ్గా పనిచేయకపోతే, ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన అన్నారు. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు సజావుగా పనిచేయడం చాలా ముఖ్యమైనదని నొక్కి చెప్పారు. వ్యతిరేకత, అడ్డంకి మధ్య వ్యత్యాసం ఉందని, ప్రతిపక్షం సభ్యుల హక్కు అని, కానీ వారు పనితీరును అంతరాయం కలిగించలేరని అన్నారు. ఎఐ ఆధారిత సాధనాలు వంటి డిజిటల్‌ ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించి, చట్టాల నిర్మాణంలో పారదర్శకత, సామర్థ్యం బలోపేతం చేయడం ఈ సమావేశం లక్ష్యమని అన్నారు. శాసనసభల పనితీరు కోసం కొత్త విధానాలను అన్వేషించడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తాయని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, డిప్యూటీ స్పీకర్‌ బండ ప్రకాశ్‌, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహా చార్యులు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల

అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు,
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె. సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతకుముందు విఠల్‌భారు పటేల్‌, పార్లమెంటరీ సంస్థల పరిణామానికి సంబంధించిన అరుదైన ఆర్కైవల్‌ రికార్డులు, ఛాయాచిత్రాలు, పత్రాలను ప్రదర్శించే ప్రత్యేక ప్రదర్శనను హౌంమంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ఆయన జీవితం ఆధారంగా ఒక స్మారక తపాలా బిళ్ళను కూడా విడుదల చేశారు. అలాగే ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad