Wednesday, December 24, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పార్లమెంట్‌లో ప్రమాదకర చట్టాలకు ఆమోదం

పార్లమెంట్‌లో ప్రమాదకర చట్టాలకు ఆమోదం

- Advertisement -

– లేబర్‌ కోడ్‌లతో ఉద్యోగ భద్రత కరువు
– డిస్కంలను ప్రయివేటీకరించేందుకే విద్యుత్‌ సవరణ చట్టం
– ‘వీబీ జీ రామ్‌ జీ’తో సామాజిక భద్రతకు తూట్లు
– ‘శాంతి’ బిల్లు దేశానికి అత్యంత ప్రమాదకరం
– మోడీ సర్కారు చేతిలో పావుగా ఈసీఐ
– కేంద్రం తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– పంచాయతీల అభివృద్ధికి విరివిగా నిధులివ్వాలి
– యూరియా పాతపద్ధతిలోనే అందించాలి
– రామారావు హంతకులను శిక్షించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో దేశానికే అత్యంత ప్రమాదకరమైన నాలుగు చట్టాలకు మోడీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసుకున్నదనీ, వాటి పరిణామాలు దేశ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హెచ్చరించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా కలిసొచ్చే శక్తులు, పార్టీలను కలుపుకుని దేశవ్యాప్త పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జ్యోతితో కలిసి రాఘవులు మాట్లాడారు. కార్పొరేట్లు అధిక లాభాలు గడించేలా నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్‌ల వల్ల కార్మికులు సమ్మె హక్కును కోల్పోతారనీ, ఉద్యోగ భద్రత ఉండదనీ, కనీస వేతనాల కోసం కార్మికులు బేరసారాలు ఆడే హక్కును కోల్పోతారని వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ మెథడ్‌ అంటే కార్మికుల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు.

డిస్కంల ప్రయివేటీకరణ కోసమే..
‘ఇప్పటివరకూ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ (డిస్కంలు) 99 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే విద్యుత్‌ సవరణ చట్టాన్ని మోడీ సర్కారు చేసిందని బీవీ రాఘవులు చెప్పారు. ఈ చట్టం వల్ల క్రాస్‌ సబ్సిడీ రద్దయ్యి, రైతులు, పేదలు ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని కోల్పోతారని వివరించారు. సబ్సిడీ మీద విద్యుత్‌ పొందుతున్న విద్యా సంస్థలు, ఆస్పత్రులు కూడా ఈ సౌకర్యాన్ని కోల్పోతాయన్నారు. కొత్త చట్టం ద్వారా విద్యుత్‌ లైన్లను ప్రయవేటు కంపెనీలు వాడుకునే అవకాశాన్ని మోడీ సర్కారు కల్పించిందని తెలిపారు. అదానీ, అంబానీ, గోద్రెజ్‌, సుజాన్‌ వంటి విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ఎప్పటి నుంచో పంపిణీ వ్యవస్థను తమకివ్వాలని ఒత్తిడి తెస్తున్నాయనీ, దానిలో భాగంగానే మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదని స్పష్టంచేశారు.

రాష్ట్రంలో మూడో డిస్కంతో ప్రజలకు నష్టం
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కమ్‌ ఏర్పాటును బీవీ రాఘవులు తప్పుబట్టారు. లాభాలు వచ్చే వాటిని ప్రయివేటు కంపెనీలకు అప్పగించి, నష్టాలు వచ్చే వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచి, క్రమంగా ప్రజలకు సేవలను తగ్గించే కుట్ర దీని వెనుక ఉందని వివరణ ఇచ్చారు.

రాష్ట్రాలకు భారంగా ‘వీబీ జీ రాం జీ’
‘జీ రాం జీ’ చట్టం రాష్ట్రాలకు పెనుభారంగా మారబోతున్నదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాలు 40శాతం నిధులను ఖర్చు చేయకపోతే కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులను ఆపేస్తుందని రాఘవులు స్పష్టంచేశారు. ఆ చట్టం ద్వారా దేశంలోనే ఎక్కువ పనిదినాలను వాడుకుం టున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు. గ్రామీణ భూస్వాము లకు, పట్టణాల్లోని కార్పొరేట్ల సంస్థలకు కారు చౌకగా కూలీలు దొరికేలా ఈ చట్టం ఉందన్నారు. దీనివల్ల గిరిజనులు, ఆదివాసీలు, దళితులు ఎక్కువగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ల కోసమే ఇన్సూరెన్స్‌ సవరణలు
సబ్‌కా బీమా సబ్‌కా రక్ష పద్ధతిలో కాకుండా, సబ్‌కీ బీమా కరోడ్‌పతికా రక్ష అన్నట్లు ఇన్సూరెన్స్‌ చట్టంలో మార్పులున్నాయని రాఘవులు విమ ర్శించారు. విదేశీ సంస్థలకు ఇన్సూరెన్స్‌ రంగంలో వంద శాతం పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని మోడీ సర్కారు కల్పించిందని చెప్పారు.

‘శాంతి’ పేరుతో విదేశీ సంస్థలకు వెల్‌కం
శాంతి పేరుతో తీసుకొస్తున్న న్యూక్లియర్‌ లయబిలిటీ బిల్లు విదేశీ సంస్థలు భారతదేశంలో కంపెనీలను స్థాపించే అవకాశాన్ని కలిస్తున్నాయనీ, అదే సందర్భంలో ఏవైనా ప్రమాదాలు జరిగితే దానికి కంపెనీల బాధ్యత ఏమీ ఉండబోదని చట్టంలో పేర్కొనటం తీవ్ర అన్యాయమని బీవీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణం దెబ్బతిన్నా, మనుషులు చచ్చినా, కార్పొరేట్ల లాభాలే ముఖ్యమన్నట్టు మోడీ సర్కారు వ్యవహరించడం తగదని హితవు పలికారు.

దేశభక్తి ముసుగులో పెట్టుబడిదారీ నిర్ణయాలు
ప్రజల ముందు దేశభక్తి అంటూ ఫోజులు కొడుతూ విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల ప్రయో జనాల కోసం మోడీ సర్కారు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదని రాఘవులు విమర్శించారు. నిజమైన దేశభక్తులు ఎన్‌డీఏ, దాని మిత్రపక్షాలు కాదనీ, దేశరక్షణ కోసం కొట్లాడుతున్న కమ్యూని స్టులు, లౌకికశక్తులు, ప్రజలేనని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసం తాము చేపట్టబోయే పోరాటాల్లో అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు.

‘సర్‌’ బీజేపీ మేలు కోసమే
తెలంగాణలో ‘సర్‌’ ప్రక్రియ ప్రారంభమైం దనీ, త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసీ) ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రకటించారని రాఘవులు గుర్తుచేశారు. సిఈసీ ‘సర్‌’ పేరుతో బీజేపీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నదనీ, బీజేపీ వ్యతిరేక ఓటర్ల ఓట్లను తొలగించే కుట్ర దీని వెనుక ఉందన్నారు. ఢిల్లీకి దగ్గర్లోని అరావళి పర్వత శ్రేణుల్లో కార్పొరేట్ల హిల్‌ హౌస్‌లు పెరిగిపోతున్నాయనీ, ఇది పర్యావరణానికి, నీటి వనరులకు తీవ్ర నష్టమని హెచ్చరించారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లా డుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుసభ్యులకు శుభాకాంక్షలు తెలి పారు. గ్రామాల అభివృద్ధిలో వారంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. ఓఆర్‌ఆర్‌ అవతలకు పరిశ్రమలను తరలించి, ఆ భూము లను పారిశ్రామికవేత్తలకే అప్పగించాలని చూడ టం సరికాదన్నారు. ఆ పేరుతో రూ.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రూ.5వేల కోట్లకే పారిశ్రామిక వేత్తలకు కట్టబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై అసెం బ్లీలో చర్చ జరగాలని సూచించారు. ఆ భూము లను ప్రజాప్రయోజనాల కోసం, పేదలకు ఇండ్లను కట్టించడం కోసం ఉపయోగించాలని కోరారు.

యూరియా యాప్‌ ఎత్తేయండి
యూరియా యాప్‌ను ఎత్తేసి పాతపద్ధతిలోనే యూరియాను అందజేయాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్‌ బోర్డుకు వేరే ప్రాంతంలో భూములు అప్పగించి దాన్ని జీహెచ్‌ఎంసీంలో కలపాలని కోరారు.

బీసీరిజర్వేషన్లపై కేంద్రంపై పోరాడాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలనూ కలుపుకుని కేంద్రంపై పోరాటం చేయాలని జాన్‌వెస్లీ చెప్పారు.

ఇన్నయ్య అరెస్టు అక్రమం
గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అరెస్టు చేయడాన్ని జాన్‌వెస్లీ తప్పుబట్టారు. అభిప్రాయాలను వ్యక్త పరిస్తే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతి రోజూ ఏదో ఒకచోట మోడీ, అమిత్‌షా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు విద్వేషపూరిత ప్రసం గాలు చేస్తున్నారనీ, వారిపై ఎందుకు కేసులు పెట్ట డంలేదని ఎన్‌ఐఏను నిలదీశారు. ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

‘పాలమూరు’ పూర్తిచేయండి
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 90 శాతం పాలమూరు రంగారెడ్డి పూర్తయిందని కేసీఆర్‌ చెప్పటం జాన్‌వెస్లీ అవాస్తమన్నారు. అదే సమ యం లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ సర్కారు నిధులను సరిగా కేటాయించడం లేదని గుర్తుచేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ల్లోని ప్రాజెక్టులపై కాలయాపన, విమర్శలు మానుకొని నిధులు కేటాయించి, పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.

రామారావు హంతకుల్ని శిక్షించాలి
ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) నేత రామారావును కిరాయి గుండాలతో హత్య చేయించిన కాంగ్రెస్‌ నేతలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జాన్‌ వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఒత్తిడితో విచారణలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -