ప్రియమైన వేణు గీతికకు
ఎలా ఉన్నావు, ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళావు, చాలా సంతోషం. పని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆచార సంప్రదాయాలు, జీవన శైలి గమనించాలి. కాకపోతే నీకు ఇవి కుదరక పోవచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.
నాన్న.. ఈ రోజు నీకు సహనం వల్ల జరిగే మంచి, సహనం కోల్పోతే జరిగే నష్టాల గురించి చెప్తాను. ఆడా మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సహనం కచ్చితంగా ఉండాలి. కొందరికి కొంచం కూడా సహనం ఉండదు. దాని వల్ల నోటికి ఏది వస్తే అది అనేయడం, చేతికి ఏది దొరికితే అది విసిరేయడం చేస్తుంటారు. ఎదుటి వారికి సహనం లేనప్పుడు మనం తిరిగి సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తే కొద్ది సేపటికి వారే తగ్గిపోతారు. వాతావరణంలో ప్రశాంత వస్తుంది. అయితే ఇప్పటి పిల్లలకు సహనం అనేదే ఉండటం లేదు. దీనివల్ల జీవితంలో సమస్యలు, కష్టాలు తెచ్చుకోవడమే కాక అనేక విధాలుగా నష్టపోతున్నారు.
ఉద్యోగం చేసే చోట, కుటుంబంలో, బంధువులు, స్నేహితులు ఇలా అందరితో మంచి సంబంధాలు ఉండాలి. అంటే దీనికి సహనం చాలా అవసరం. వాళ్ళు ఏదో అన్నారని చిన్న విషయాలని పెద్దవిగా చేసుకుని గొడవలు పెట్టుకునే బదులు, కొద్ది సేపు సహనం వహించి మౌనంగా ఉంటే బంధాలు అనుబంధాలుగా మారుతాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొందరికి ఎదుటివారిని ఏదో ఒకటి అని బాధ పెడితే కానీ తృప్తి ఉండదు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. లేదా సున్నితంగా చెప్పాలి.
ఇక కుటుంబం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఎప్పుడో ఒకప్పుడు అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకునే బదులు ఇద్దరిలో ఒకరు కొద్దిసేపు సహనం వహించి మౌనంగా ఉంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనువైన సమయం చూసి మీ భాగస్వామికి మీ అభిప్రాయం చెప్పొచ్చు. సహనానికి మించిన సంపద లేదు. దీనివల్ల అంతా మంచే, అందరికీ మంచే జరుగు తుంది. ప్రేమాభిమానాలు పెరుగుతాయి, ఏ బంధమైనా బలపడుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, నేర్పాలి. సహనం కోల్పోతే ఎలాంటి నష్టాలు వస్తాయో వివరించాలి. ఈ మధ్య వివాహ బంధాలు విచ్చిన్నం కావడానికి చాలా వరకు సహనం లేకపోవడమే కారణం.
నాన్నా.. నీకు సహనం చాలా ఎక్కువ. స్నేహితుల వద్ద సహనం చూపిస్తూ, వారు చేస్తున్నది తప్పు అనిపించినప్పుడు, సమయం చూసి చెప్తావు చూడు అది మంచి పద్ధతి. అయితే నువ్వు చెప్పింది వాళ్లు అర్ధం చేసుకుంటారు అనుకున్నప్పుడే చెప్పటం మంచిది. అందరూ ఒకే రకంగా వుండరు కదా! పడే వాడు ఉంటే అనేవాడికి లోకువ అంటారు. ఆ పరిస్థితి మాత్రం రాకుండా చూసుకో. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుంటావాని ఆకాంక్షిస్తూ.. త్వరలో నిన్ను చూడబోతున్నందుకు ఆనందంగా ఉంది… వుంటాను నాన్న..!
ప్రేమతో మీ అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి