Friday, July 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు!

ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు!

- Advertisement -

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య 1,233వ రోజులో ప్రవేశించింది. పుతిన్‌ సేనలు, రష్యాపై దాడులు చేసేందుకు అవసరమైతే పేట్రియాట్‌ క్షిపణులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించటంతో సంక్షోభం మరోమలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కీలక ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి కొద్ది రోజులు కూడా గడవక ముందే మిలిటరీ సరంజామా పంపుతున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం జరగ్గానే, బుధ, గురువారాల్లో రష్యన్‌ సేనలు పెద్దఎత్తున డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడులు జరిపాయి. మరోవైపున శాంతిచర్చలకు చొరవ చూపేందుకు పోప్‌ లియో సుముఖంగా ఉన్నారని ఆయనను కలిసిన తర్వాత జెలెన్‌స్కీ ప్రకటించాడు. వివిధ ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తున్న రష్యా కొత్తగా మరికొన్ని ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించింది. పుతిన్‌ వ్యవహార శైలితో తాను సంతోషంగా లేనని మంగళవారం నాడు మంత్రివర్గ సమావేశం తర్వాత ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ గురించి నోరుపారవేసుకున్న ట్రంప్‌ తీరును తాము పట్టించుకోవటం లేదని రష్యా స్పందించింది. గురువారం నాడు రోమ్‌ నగరంలో ఉక్రెయిన్‌ స్వస్థత సమావేశం జరగటానికి ముందు జెలెన్‌స్కీ ఇటలీలో ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌తో సమావేశం సందర్భంగా రష్యా దాడులను తీవ్రం కావించింది. పోప్‌ లియోను రెండు నెలల్లోనే జెలెన్‌స్కీ రెండుసార్లు కలిశాడు.
పోరు ఇంకా కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌ పునరుద్ధరణ పథకాలు దానికి అవసరమైన పెట్టుబడులు, దానిలో పాలుపంచుకొనే దేశాలు, నిర్మాణ సంస్థల గురించి పశ్చిమదేశాలు వాణిజ్య చర్చలు జరపనున్నాయి.రాజకీయ, వాణిజ్యవేత్తలు దీనిలో భాగస్వాములు కానున్నారు. ఇల్లు కాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూడటం తప్ప మరొకటి కాదు. నాటో కూటమి దేశాలు అనుసరించిన వైఖరి కారణంగానే ఉక్రెయిన్‌ సంక్షోభం అన్నది తెలిసిందే. దాన్ని ముగించాల్సిన బాధ్యత కూడా వారి మీదే ఉంది. దాన్ని పక్కనపెట్టి దాదాపు ఆరువందల బిలియన్‌ డాలర్లతో తిరిగి ఉక్రెయిన్‌ను బాగుచేస్తామని ఆ కాంట్రాక్టులను కూడా తమకే ఇవ్వాలని కోరుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?తమపై పోరుకు పుతిన్‌కు చైనా మద్దతు ఇస్తున్నదని జెలెన్‌స్కీ ఆరోపించాడు. పౌరులకు హానికలింగే మందుపాతరలను అమర్చకూడదన్న అట్టావా ఒప్పందం నుంచి వైదొలిగిన ఉక్రెయిన్‌ పౌరులను బలితీసుకుం టున్నదని రష్యా విమర్శించింది.
తమ దగ్గర ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నం దున ఉక్రెయిన్‌కు పంపలేమని, కొద్ది రోజులు నిలుపుదల చేస్తున్నట్లు పెంటగన్‌ ప్రకటించిన వారం తర్వాత పునరుద్దరించటం వివాదాన్ని పరిష్కరించాలనే చిత్తశుద్ధి అమెరికాకు లేదన్నది స్పష్టం. మీరు గనుక ఉక్రెయిన్‌ మీద దాడి చేస్తే నేను మాస్కో మీద బాంబులు వేయిస్తానని పుతిన్‌తో మాట్లాడినపుడు ట్రంప్‌ బెదిరించాడన్న వార్త గుప్పుమన్నది. అయితే వారి మధ్య ఆ సంభాషణ ఎప్పుడు జరిగిందో, అది నిజమో కాదో నిర్ధారణ కాలేదు గానీ, ఆధునిక ఆయుధాలను ఇస్తాన్న ట్రంప్‌ మాటలు దాన్ని నిర్ధారిస్తున్నాయి.కొద్ది వారాల క్రితం రష్యా భూభాగంలో ప్రవేశించి అనేకచోట్ల ఉక్రెయిన్‌ జరిపిన దాడుల వెనుక అమెరికా హస్తం లేదని మెడమీద తలకాయ ఉన్నవారెవరూ చెప్పరు.
అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ట్రంప్‌ చెప్పాడు. పుతిన్‌తో నేరుగా మాట్లాడాడు. ‘రష్యాకు రాయితీలు ఇవ్వాల్సిందే, కొన్ని ప్రాంతాలు వదులుకోవాల్సిందే, మేం 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చినా యుద్ధంలో గెలిచేది లేదు చచ్చేది లేదని’ జెలెన్‌స్కీతో చెప్పాడు. అతగాడిని మంచి హాస్యనటుడు అంటూనే ఎన్నికలు జరపని నియంత అన్నాడు. ఓవల్‌ కార్యాలయంలో అవమానించాడు. రష్యాను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించాడు. ఐరోపా దేశాలన్నీ ఈ తీరును చూసి నిజంగానే ట్రంప్‌ తమను వదిలి పుతిన్‌తో చేతులు కలిపి ఉక్రెయిన్‌ను అప్పగిస్తాడా అన్నంతగా భయపడ్డాయి. చివరికి భద్రతా మండలిలో రష్యామీద ఎలాంటి విమర్శలు లేని తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఈలోగా ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని అమెరికా రాయించుకొని ఒప్పందం చేసుకుంది. తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే అసలు వాటికోసమే ట్రంప్‌ ఇంతనాటకం ఆడాడా అన్న సందేహాలు కలిగాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌కు పెద్దమొత్తంలో కీలక ఆయుధాలు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేశాడంటే పోరును మరింతగా కొనసాగించేందుకు పూనుకున్నాడన్నది తేటతెల్లమైంది. ఇలాంటి ఉన్మాదులను సభ్యసమాజం గట్టిగా వ్యతిరేకించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -