Monday, July 7, 2025
E-PAPER
Homeఆటలుక్వార్టర్స్‌లో పవ్లిచెంకోవ

క్వార్టర్స్‌లో పవ్లిచెంకోవ

- Advertisement -

– లోకల్‌ స్టార్‌ కార్టల్‌పై గెలుపు
– టేలర్‌ ఫ్రిట్జ్‌ సైతం ముందంజ
– వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2025
నవతెలంగాణ-లండన్‌

రష్యా క్రీడాకారిణి అనస్తాసియ పవ్లిచెంకోవ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో లోకల్‌ స్టార్‌, బ్రిటన్‌ అమ్మాయి సోనె కార్టల్‌పై పవ్లిచెంకోవ ఘన విజయం సాధించింది. రెండు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో 7-6(7-3), 6-4తో పవ్లిచెంకోవ వరుస సెట్లలో గెలుపొందింది. మహిళల సింగిల్స్‌ నుంచి తొలి క్వార్టర్స్‌ బెర్త్‌ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో అమెరికా ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ సైతం క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపాడు. ఐదో సీడ్‌ టేలర్‌ 6-1, 3-0తో జోర్డాన్‌ థామ్సన్‌ (ఆస్ట్రేలియా)పై పైచేయి సాధించాడు.


పవ్లిచెంకోవ మెరుపుల్‌ :
34 ఏండ్ల పవ్లిచెంకోవ 2016 తర్వాత తొలిసారి వింబుల్డన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో లోకల్‌ స్టార్‌ సోనె కార్టల్‌ (23)కు అభిమానుల నుంచి విశేష మద్దతు లభించింది. అందుకు తగినట్టుగానే తొలి సెట్లో కార్టల్‌ గొప్పగా ఆడింది. ఉత్కంఠగా సాగిన తొలి సెట్‌ టైబ్రేకర్‌కు దారితీయగా.. 7-3తో పవ్లిచెంకోవ పైచేయి సాధించింది. రెండో సెట్లోనూ కార్టల్‌ మెరిసినా.. ఈసారి పవ్లిచెంకోవ టైబ్రేకర్‌ వరకు కష్టపడలేదు. 6-4తో రెండో సెట్‌ను, క్వార్టర్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. సోనె కార్టల్‌ ఆరు ఏస్‌లు మెరిసినా.. పవ్లిచెంకోవ ఐదు బ్రేక్‌ పాయింట్లతో అదరగొట్టింది. కార్టల్‌ సైతం నాలుగు బ్రేక్‌ పాయింట్లతో ఆఖరు వరకు రేసులో నిలిచింది. పాయింట్ల పరంగా 89-83తో పవ్లిచెంకోవ పైచేయి నిలుపుకుంది. సోనె కార్టల్‌ స్వీయ సర్వ్‌లో ఆరు గేమ్‌ పాయింట్లు సాధించగా.. పవ్లిచెంకోవ ఏడు గేమ్‌ పాయింట్లు సాధించింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి అద్భుతంగా రాణించిన సోనె కార్టల్‌ జోరుకు ప్రీ క్వార్టర్స్‌లో పవ్లిచెంకోవ చెక్‌ పెట్టింది.
పురుషుల సింగిల్స్‌లో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)కు వాకోవర్‌ లభించింది. జోర్డాన్‌ థామ్సన్‌తో మ్యాచ్‌లో 6-1, 3-0తో ముందంజలో కొనసాగాడు. ఈ సమయంలో జోర్డాన్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో టేలర్‌ ఫ్రిట్జ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో కారెన్‌ కచకోవ్‌ (రష్యా) 6-4, 6-2, 6-3తో కమిల్‌ (పొలాండ్‌)పై గెలుపొందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -