ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించుకుందామో నిర్ణయించుకోవాలి
ధైర్య సాహసాలతో నిర్ణయాలను అమలు చేయాలి : యూఎన్‌జీఏ సమావేశాలను ప్రారంభిస్తూ గుటెరస్ పిలుపు
న్యూయార్క్ : శాంతి, సహకారాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పిలుపిచ్చారు. చరిత్రలో నిర్ణయాత్మక పరిస్థితులు తలెత్తినపుడు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని ఆయన నేతలను కోరారు. మంగళవారం యూఎన్‌జీఏ 80 వార్షిక సమావేశాలను ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు. గందరగోళ పరిస్థితుల సమయంలో సహకారం, అరాచకం నెలకొన్నపుడు చట్టం, ఘర్షణలపుడు శాంతికి ప్రాధాన్యతనివ్వాలని భావిస్తూ వ్యవస్థాపక సూత్రాలుగా వాటిని పేర్కొంటూ 80ఏండ్ల నాడు ఐక్యరాజ్య సమితి ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాటి నిబద్ధతకు ‘హృదయ స్పందన’వంటిది ఈనాటి అసెంబ్లీ అని ఆయన వ్యాఖ్యానించారు.
నైతికతకు దిక్సూచి,అంతర్జాతీయ చట్టాలకు సంరక్షకురాలు, సుస్థిర అభివృద్ధికి ఉత్ప్రేరకం వంటిది ఐక్యరాజ్య సమితి అని నేతలకు గుర్తు చేశారు. ఎనిమిది దశాబ్దాలు గడిచిపోయాయి, కానీ మనందరం కలిసి నిర్మిం చుకోవడానికి ఎటువంటి ప్రపంచాన్ని ఎంచుకుం దాం? అని ఆయన ప్రశ్నించారు. సరైన ఎంపికలు, నిర్ణయాలు తీసుకుంటే సరిపోదని, వాటిని ఆచరణలో పెట్టడానికి నేతలు ధైర్య సాహసాలు కూడగట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జనరల్ అసెంబ్లీ సమా వేశాల్లో సాధారణ చర్చ ప్రారంభమైంది. పలు దేశాల అధ్యక్షులు ప్రసంగిం చనున్నారు. సాంప్ర దాయా నుసారం తొలుత బ్రెజిల్ అధ్యక్షుడు ప్రసంగించారు మొత్తం గా ప్రపంచనేతలు పెద్ద సంఖ్యలో కొలువుదీరి వుండడంతో ఐక్యరాజ్య సమితి క్యాంపస్ లోపల, బయటా భద్రతను కట్టుదిట్టం చేశారు.