– ప్రపంచం ముందు రెండు ఆప్షన్లు : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
– విజయానికి 80 ఏండ్లు
– తియాన్మిన్ స్క్వేర్ వద్ద చైనా పరేడ్
– తొలిసారి అధునాతన ఆయుధాల ప్రదర్శన
– ఒకే వేదికపై పుతిన్, కిమ్, జిన్‌పింగ్
– 26 దేశాలకు చెందిన అధినేతలు హాజరు
బీజింగ్ : రెండవ ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి 80ఏండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం చైనా సెంట్రల్ బీజింగ్‌లో పెద్ద ఎత్తున మిలటరీ పరేడ్ నిర్వహించింది. ప్రస్తుతం ప్రపంచం ముందు శాంతి లేక యుద్ధం అనే రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలం, అనిశ్చితులతో నిండిన ప్రపంచంలో శాంతియుత అభివృద్ధిని సాధించేందుకు చైనా కట్టుబడి వుందని నేతలు ప్రతిన చేశారు. విదేశీ దురాక్రమణలను ప్రతిఘటించడంలో దేశం చూపిన తెగువ, సంఘీభావాలకు చిహ్నంగా గ్రేట్ వాల్ వంటి ఎత్తైన నిర్మాణాలను తియాన్మిన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మెన్ జీ జిన్‌పింగ్ పరేడ్‌ను మొత్తంగా పర్యవేక్షించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో చైనాకు మద్దతు ఇచ్చిన వ్యక్తుల ప్రతినిధులు లేదా వారి కుటుంబ సభ్యులు రష్యా, అమెరికా, బ్రిటన్ ఫ్రాన్స్, కెనడా ఇలా వేర్వేరు దేశాల నుండి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. తియాన్మిన్ స్క్వేర్ మీదుగా హెలికాప్టర్లు ఎగురుతూ న్యాయం, శాంతి నెలకొనాలి అని రాసి వున్న బ్యానర్లను ప్రదర్శించాయి. సైనికబలగాలు కవాతు సహా వివిధ విన్యాసాలను నిర్వహించారు. ట్యాంకులు, శతఘ్నులు, ఇతర మిలటరీ పరికరాలతో ఆ ప్రాంతంలో ప్రదర్శన చేశాయి. యుద్ధ కాలం నాటి కమాండ్ వ్యవస్థకు అనుగుణంగా 10వేల మందికి పైగా మిలటరీ సిబ్బంది, వందకు పైగా విమానాలు, వందలాది సాయుధ వాహనాలు వివిధ ఫార్మేషన్లను ఏర్పాటు చేశాయి. జిన్‌పింగ్ నాయకత్వంతో చేపట్టిన సైనిక సంస్కరణల ఫలితంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) కొత్త సేవలు, ఆయుధ వ్యవస్థ అంతా మొదటిసారిగా ఈ ప్రదర్శనలో కనబడింది. మానవ రహిత నిఘా పరికరాలు, హైపర్‌సోనిక్ క్షిపణులు, ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థలు, అంతర్జాతీయ దాడులు నిర్వహించగల సామర్ధ్యం కలిగిన వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో పాల్గొనే చైనా సైనికులు మొదటిసారిగా విజయోత్సవ పరేడ్‌లో తియాన్మిన్ స్క్వేర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. తమ పూర్వీకుల రక్తంతో సంపాదించుకున్న శాంతిని పరిరక్షించుకునేందుకు తాము నిబద్ధులమై వున్నామని సైనిక జవాను షావో జియావోగుయాంగ్ వ్యాఖ్యానించారు.
శాంతియుత అభివృద్ధికి కట్టుబడి వున్నాం
పరేడ్‌కు ముందుగా జిన్‌పింగ్ ప్రసంగించారు. 80ఏండ్లు క్రితం సాధించిన విజయం ప్రాముఖ్యతను వివరించారు. ఆధునిక కాలంలో విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా సాధించిన మొదటి సంపూర్ణ విజయమిదని వ్యాఖ్యానించారు. శాంతియుత అభివృద్ధికి చైనా కట్టుబడి వుందని ఆయన పునరుద్ఘాటించారు. ‘శాంతి కావాలా లేదా యుద్ధమా’ అనే ఎంపికను ఈనాడు మానవాళి మళ్లీ ఎదుర్కొంటోందని అన్నారు.
ఒకే వేదికపై ముగ్గురు నేతలు
మిలిటరీ పరేడ్ సందర్భంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు ఒకే వేదికపై ఆసీనులై తమ ఐక్యతను చాటారు. తమను వాషింగ్టన్ గుప్పెట్లోకి తీసుకోవాలనుకున్న అమెరికాకు, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌నకు బలమైన సందేశం పంపారు. షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు మిలిటరీ పరేడ్ సందర్భంగా సమావేశమయ్యారు.
ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర : ట్రంప్
మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తరకొరియా నాయకుడు కిమ్‌జోంగ్ ఉన్‌లపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికా సైనికుల త్యాగాలను గుర్తించాలన్నారు. నాటి పోరాటంలో ఎంతోమంది యూఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వారి ధైర్యం, త్యాగాలను జిన్‌పింగ్ గుర్తించి, గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, చైనా ప్రజలకు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. కిమ్ , పుతిన్‌లకు అభినందనలు తెలుపుతూనే వారు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ట్రంప్ ఆరోపించారు.
శాంతినా..యుద్ధమా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES