Sunday, July 6, 2025
E-PAPER
Homeకవితపెద్ది బుచ్చమ్మ

పెద్ది బుచ్చమ్మ

- Advertisement -

పేరు పెద్ది బుచ్చమ్మ
ఊరు కట్టగూరు పక్కన బొల్లేపల్లి
ఇల్లు గడవక పెనిమిటిని ఒప్పించి
మా ఊరికి బతకొచ్చిన ఆడబిడ్డ
గౌండ్ల నర్సయ్య జ్యేష్ఠపుత్రిక
వనాన్ని నమ్ముకున్న
మునిరూపుడు లక్ష్మయ్య
బతుకు గాడెంలోకి వొదిగిపోయి జీవనాన్ని
పావనంగా సాగించిన ధర్మపత్ని-
మనిషి కురుచ, మనసు పొడవాటి
ముఖం ముద్దమందారం, మాట మంత్రముగ్ధం
సొమ్ముకు నిరుపేదైనా
సోపతికి కుబేరుడి చెల్లెలు-
కంఠమా మహేశ్వరుడిలా
లక్ష్మయ్య కావడి జగిట్ల దించంగానే
కల్లుకుండల్ని చుట్టకుదుర్ల మీద పొందబెట్టి
పార్వతీదేవిలా మా ఇంట్లకొచ్చేది-
చెంద్రమ్మా ఏడి మీ నర్సింహులు
బొడ్డుగురిగికి పెదుం ఆనిస్తె చాలు
కల్లు అమతంలా అమ్ముడైతదని
నన్ను ఎట్లున్నోణ్ని అట్లనే పావురంగ
ఎత్తుకుపోయేది
నిత్య అతిథి నేను
బుచ్చెమ్మ గుండె పందిరికి-
కల్లు నురగ కాశ్మీర్‌ మంచులా
కుండల పైఅంచుల్ని కప్పేస్తూ
వాసనలు పొంగేది-
బుచ్చెమ్మను ఇచ్చెంత్రాలడుగుతూవున్న
నా బాలవ్యాకరణాన్ని
లక్ష్మయ్యతాత చిరునవ్వులు సాన బడుతుండె-
నేను కల్లు ముట్టని రోజు
బుచ్చమ్మ సురాభాండం బోణీ కొట్టదు
నేను గురిగి పట్టని దినం
లక్ష్మయ్యతాత మోకు ముస్తాదుకు హుషారుండదు-
తొమ్మిది పదినెలల కానుంచి
బడిలో అడుగుపెట్టిన ఆరోఏడువరకు
ప్రతి పొద్దుట మల్లెలతీర్థం లాంటి
కమ్మటికల్లు తాపుతూ
నన్నో సురామనోహరుడిని చేసిన
కల్పద్రుమం ఆమె- పాలిచ్చిన అమ్మ
కల్లు తాపిన బుచ్చమ్మ
నాకు శైశవం ప్రసాదించిన ఇద్దరు తల్లులు- బుచ్చెమ్మ
మా వూరి తొలి గౌండ్లకవయిత్రి
అర్వపల్లి గుట్టంత ఎత్తూవెడల్పు ఉంటది
ఆమె ఊహాశక్తి-
బొడ్డుగురిగిపట్టి కల్లు తాగుతున్నప్పటి నాకు
రేపల్లెలో కడవలెత్తి వెన్నలారగించిన
చిన్నికష్ణుడికి పోలిక చెప్పేది-
అరచేతిలో అదష్టరేఖ ఉంది
మందను మలుపుకొస్తడు, మందిల గెలిచొస్తడు
ఫికర్‌ జెయ్యకు సాయిలని నాన్నకు
నా నసీబ్‌ వివరించేది-
అమ్మ కలల కుంచెతో వేసిన
నా పసితనపు తైలవర్ణ చిత్తరువుకు
బుచ్చమ్మ ఒక గోల్డ్‌ ఫ్రేమ్‌ –
అమ్మ అడవికి పోయి
నేను పాలకేడ్చినప్పుడు స్తన్యమిచ్చిన మాతమూర్తి-
అన్నం తినిపించేటప్పుడు
బుచ్చెమ్మ స్టీలుపళ్లెం నాకో అక్షయ పాత్ర-
అమ్మ ఉమ్మనీటి మహిమో
బుచ్చెమ్మ తీయటి కల్లు మహిమో
నేను ఆఫీసర్‌ అయితిని-
ఎంతసేపున్నా పొరుగూరు పొరుగూరే కదా
మంచి చెడులకు అల్లుకుపోయే
సొంతూరులా ఉండదు
ఏదో ఓ మూలన పరాయివన్న
ఆక్షేపణ ముల్లులా గుచ్చుకుంటూనే వుంటది లోలోపల-
బుచ్చెమ్మ దంపతులిద్దరూ
పిల్లాపాపలతో వాళ్లూరు వెళ్లిపోయి
పెద్ద కాలమే అయింది-
ఓ సారి ఫోన్‌ చేసి
సంక్రాంతి పండుగకు మా ఊరికి రమ్మన్న
మాట తప్పని బుచ్చెమ్మ ఇంటికొచ్చింది
నిండు బట్టలు పెట్టి
నేనూ నా భార్యాపిల్లలం ఆశీస్సులు తీసుకున్నం
అప్పుడామె శక్తిపీఠం, మాది మహర్లోకం-
మా ఇంట్లో కూరాడు పక్కన దుగుట్ల
ఋచ్చెమ్మ ఇచ్చిన బొడ్డుగురిగిని భద్రంగా దాచి పెట్టిన
కొత్తింటికి మారేటప్పుడూ
అమ్మ భద్రంగానే తెచ్చింది పూజా ద్రవ్యంలా-
కర్కశ కరోనా కాటేసి
ఆ మధ్యన పానమిడిసిందన్న వార్త తెలిసింది
కన్నీట సుడితిరుగుతూ తాటిమొగులు దాటి
బుచ్చెమ్మ అసువిడిసిన తోవల
ఆత్మగీతం ఆలపిస్తూ బొల్లేపల్లికి పయనమైంది
బొడ్డుగురిగి-
– డా.బెల్లి యాదయ్య, 9848392690

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -