• సీపీఎస్ విధానం రద్దుకై పోరాటం సాగిస్తాం
• విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి
• టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్దోజు కవిత
నవతెలంగాణ -పెద్దవంగర
రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సి పెండింగ్ బిల్లులు, పీఆర్సీ లు తక్షణమే విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్దోజు కవిత అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో టీపీటీఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేష్ అధ్యక్షతన జిల్లా స్థాయి అధ్యయన తరగతులు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్దోజు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ తో కలిసి మాట్లాడారు.
రెండేళ్లుగా ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఐదు డీఏ లు పెండింగ్ లో ఉన్నాయని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన హెల్త్ కార్డు విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఉద్యోగులకు మరణ శాసనం గా మారిన సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు విద్యా రంగానికి కేటాయించి, బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. కామన్ స్కూల్ గా చలామణి అవుతున్న జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు.
కొత్త పేర్లతో వస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయలేవని, కేవలం కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయడం ద్వారానే సమాజంలోని రుగ్మతలను తొలగించవచ్చునని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సర్వీస్ రూల్స్ పై, లీవ్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా పారదర్శకంగా పనిచేయడానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాలలో టీపీటీఎఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ సోమారపు ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సాంబయ్య, తండ ప్రభాకర్ గౌడ్, కొండం జనార్ధన్, రాచకొండ ఉపేందర్, పెండ్లి రవీందర్ రెడ్డి, సంఘ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు సబియా బాను, మండల అధ్యక్ష కార్యదర్శులు చిక్కాల సతీష్, వల్లాల శ్రీనివాస్, నాయకులు దేవేందర్ నాయక్, యుగంధర్, ఎల్లా గౌడ్, సురేంద్ర కుమార్, ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.



