Sunday, October 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ డీఏలను విడుదల చేయాలి

పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలి

- Advertisement -

టీపీటీయూ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని టీపీటీయూ రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌, టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. ప్రభుత్వంతో చర్చల కారణంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, డీఏల విడుదల త్వరలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటైందని అన్నారు. పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలనీ, పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు.

అధ్యక్షత వహించిన టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకోవాలనీ, 2023, జులై ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని కోరారు. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేసి పదోన్నతులను కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనీ, తరగతి గదికి ఒక టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ హుస్సేనీ, టీపీటీయూ వ్యవస్థాపకులు జి వేణుగోపాలస్వామి, ప్రధాన కార్యదర్శి పి చంద్రశేఖర్‌, అదనపు ప్రధాన కార్యదర్శి కె సారయ్య, గౌరవ సలహాదారు గుండం మోహన్‌రెడ్డి, భూపతి శ్రీనివాస్‌, సోమ్లనాయక్‌, నర్సింగ్‌రావు, గురుప్రసాద్‌, నిమ్మల శ్రీనివాస్‌, రమేష్‌, భుజంగం, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -