బెంబేలెత్తిస్తున్న ఐటీశాఖ సందేశాలు
ఆందోళనలో పన్ను చెల్లింపుదారులు
న్యూఢిల్లీ : ఐటీ శాఖ నుంచి వస్తున్న సందేశాలను చూసి వేలాది మంది పన్ను చెల్లింపుదారులు గుండెలు బాదుకుంటున్నారు. ఎలాంటి కారణం చూపకుండానే వారి ట్యాక్స్ రిఫండ్స్‌ను అధికారులు ఆపేస్తున్నారు. ‘పుట్ ఆన్ హోల్డ్’ అంటూ వస్తున్న సందేశాలతో ట్యాక్స్ పేయర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోనీ ఎప్పుడు రిఫండ్ చేస్తారో కూడా చెప్పడం లేదు. అసలు ఐటీ వ్యవస్థలో ఏం జరుగుతోంది? ఎప్పటికప్పుడు సకాలంలో పన్నులు చెల్లించే నిజాయితీపరులను కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?. గత కొన్ని రోజులుగా వేలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ నుంచి అనూహ్యమైన సందేశం అందుతోంది.
ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో వస్తున్న ఈ సందేశం ఏమిటంటే…’రిఫండ్ క్లెయిమ్‌ను రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ కింద గుర్తించడం జరిగింది. ప్రాసెసింగ్‌ను హోల్డ్‌లో ఉంచాము’. వేతన జీవులు ఐటీ శాఖ నుంచి రిఫండ్ కోరడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే రిఫండ్ వ్యవహారం పరిష్కారం కాలేదన్నది సందేశం సారాంశం. ఎక్కడ పొరబాటు జరిగిందో చెప్పడం లేదు. రిఫండ్ రావాలంటే ఏం చేయాలో కూడా చెప్పడం లేదు. అసలు డబ్బు వాపసు రావడానికి ఎంత కాలం పడుతుందో తెలీడం లేదు. దేనిపైనా స్పష్టత లేకపోవడంతో గందరగోళం పెరుగుతోంది. ఐటీ శాఖ పంపుతున్న సందేశాల స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలోనూ, పన్ను చెల్లింపుదారుల ఫోరమ్‌లోనూ దర్శనమిస్తున్నాయి.
వివరాలు మ్యాచ్ కాకపోతే…
ఆదాయపన్ను శాఖ అధికారులు ఆటోమేటెడ్ తనిఖీల పైనే ఎక్కువగా ఆధారపడుతుండడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లలో సమర్పించిన వివరాలను అప్పటికే యాజమాన్యాలు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల నుంచి తీసుకున్న వారి డేటాలతో ఐటీ శాఖ సరిపోల్చుకుంటుంది. ఫారం 16, ఫారం 26ఏఎస్, వార్షిక సమాచార స్టేట్‌మెంట్ ద్వారా ఈ డేటా లభిస్తుంది. ఈ డేటాతో ఉద్యోగులు సమర్పించే వివరాలు మ్యాచ్ కాకపోతే రిఫండ్స్‌ను ఆపేస్తారు. సొమ్మును విడుదల చేసే ముందు రిటర్న్‌లను సమీక్షిస్తారు.
నిపుణులు ఏమంటున్నారు?
ఐటీ శాఖ నుంచి వస్తున్న సందేశాలను సంప్రదాయ పన్ను నోటీసులుగా చూడకూడదని నిపుణులు తెలిపారు. క్లెయిములను తిరిగి పరిశీలించుకోవాల్సింది గా పన్ను చెల్లింపుదారులను కోరడానికి ఐటీ శాఖ ఇలాంటి సందేశాలు పంపుతుందని చెప్పారు. జరిమానా విధించడానికి బదులుగా ముందస్తు సూచన చేయడమే వీటి ఉద్దేశమని ఐటీ నిపుణులు అన్నారు. పన్ను చెల్లింపుదారులు కోరినంత రిఫండ్ చేసి, ఆ తర్వాత పొరబాటున పంపిన సొమ్మును రాబట్టుకునే బదులు ముందుగానే ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటారని వివరించారు.
వ్యత్యాసాలు ఇలా జరగొచ్చు
తమ వైపు నుంచి పొరబాటు జరగకపోయినప్పటికీ సందేశాలు వచ్చాయని పలువురు పన్ను చెల్లింపుదారులు అంటున్నారు. అది నిజమే కావచ్చు. కొన్ని సందర్భాలలో ఉద్యోగులు డిడక్షన్లకు సంబంధించి అందజేసిన రుజువులను యాజమాన్యాలు తిరస్కరించవచ్చు. అయినప్పటికీ పన్ను చెల్లింపుదారులు ఆ డిడక్షన్లను చట్టబద్ధంగానే క్లయిమ్ చేసుకోవచ్చు. ఈ వ్యత్యాసాలనే ఐటీ సిస్టమ్ గుర్తించి తప్పుపడుతుంది. వివరాలు మ్యాచ్ కాలేదని చెబుతుంది. దీంతో రిఫండ్‌ను హోల్డ్‌లో ఉంచుతారు. ఆటోమేటెడ్ తనిఖీలు వ్యత్యాసాలను గుర్తిస్తాయి. అయితే అవి ఉద్దేశపూర్వకంగా జరిగాయని నిర్ధారణకు రాకూడదు.



